దేశ వ్యాప్తంగా జవహర్ నవోదయ స్కూళ్లలో 6వ తరగతిలో ప్రవేశం కోసం దరఖాస్తు గడువును పొడిగించారు. అక్టోబర్ 7వ తేదీ వరకు ప్రవేశ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. షెడ్యూల్ ప్రకారం.. గతంలో ప్రకటించిన గడువు సెప్టెంబర్ 23తో ముగిసింది. దీంతో విద్యార్థలు తల్లిదండ్రుల విజ్ఞప్తితో మళ్లీ పొడిగించారు. అక్టోబర్ 7 వరకు గడువును పొడిగిస్తూ కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది.
అటు విద్యార్థులు తమ అప్లికేషన్స్‌లో సవరణ చేసుకునేందుకు దరఖాస్తులు దాఖలు చివరి తేదీ తర్వాత రెండు రోజుల పాటు అవకాశం ఉంటుంది. ప్రవేశ పరీక్ష ద్వారా విద్యార్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉచిత విద్య ఉంటుంది. హిందీ, ఇంగ్లీష్, తెలుగు మూడు భాషల్లోనూ విద్యార్థుల్లో సామర్థ్యం పెంపు, వలస విద్యా విధానం ద్వారా జాతీయ సమైక్యత పెంపొందించడం జవహర్ నవోదయ విద్యాలయాల ముఖ్య ఉద్దేశ్యం. దేశ వ్యాప్తంగా 653 జవహర్ నవోదయ విద్యాలయాలు ఉండగా.. తెలంగాణలో 9, ఆంధ్రప్రదేశ్‌లో 15 ఉన్నాయి.