ఇంటర్ విద్యార్థులకు శుభ‌వార్త‌.. ఛాయిస్ పెంపు..!

Good News for Inter students in Telangana.తెలంగాణ రాష్ట్రంలోని ఇంట‌ర్ విద్యార్థుల‌కు ఇంట‌ర్ బోర్డు త్వ‌ర‌లోనే

By తోట‌ వంశీ కుమార్‌  Published on  23 Jan 2022 3:31 AM GMT
ఇంటర్ విద్యార్థులకు శుభ‌వార్త‌.. ఛాయిస్ పెంపు..!

తెలంగాణ రాష్ట్రంలోని ఇంట‌ర్ విద్యార్థుల‌కు ఇంట‌ర్ బోర్డు త్వ‌ర‌లోనే శుభ‌వార్త చెప్ప‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఇంట‌ర్ వార్షిక ప‌రీక్ష ప్ర‌శ్నాప‌త్రాల్లో మ‌రింత ఛాయిస్‌ను పెంచాల‌ని బోర్డు నిర్ణ‌యించినట్లు స‌మాచారం అందుతోంది. గ‌త విద్యాసంవ‌త్స‌ర‌మే రెండు సెక్ష‌న్ల‌లో భారీగా ఛాయిస్ పెంచ‌గా.. వ‌చ్చే వార్షిక ప‌రీక్ష‌ల‌కు కూడా మ‌రోసారి పెంచ‌నున్నారు. గ‌తేడాది వ‌ర‌కు సైన్స్ గ్రూపుల్లో మూడు సెక్ష‌న్ల‌లో రెండు సెక్ష‌న్ల‌ల‌లో ఛాయిస్ ఇవ్వ‌గా.. రెండు మార్కుల ప్ర‌శ్న‌ల్లో ఛాయిస్ లేదు. అయితే.. ఈ సారి ఆ సెక్ష‌న్‌లోనూ ఛాయిస్ ఇవ్వ‌నున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు రెండు మార్కుల సెక్ష‌న్‌లో 10 ప్ర‌శ్న‌లు ఉండ‌గా.. 10కి స‌మాధానాలు రాయాల్సి ఉండేది. అయితే.. ఇప్పుడు వాటిని 15కి పెంచారు. అంటే.. 15 ప్ర‌శ్నలు ఇవ్వ‌నుండ‌గా.. 10కి సమాధానం రాస్తే చాలు.

ఇక ఆర్ట్స్ గ్రూపుల్లో గ‌తంలో 10 మార్కుల ప్ర‌శ్న‌లు 6 ఇస్తే 3 రాయాలి. ఇప్పుడు దాన్ని ఏడుకు పెంచనున్నారు. 5 మార్కుల ప్ర‌శ్న‌లు 16కు ఎనిమిది రాయాలి. వాటిని 18కి పెంచుతారు. అదేవిధంగా గత ఏడాది లాగే ఈ సారి కూడా 70శాతం సిలబస్ నుండి ప్రశ్నలు అడుగుతారు. కరోనా నేపథ్యం లో క్లాసులు సరిగ్గా జరగపోవడం వల్ల ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటుంది. అంతే కాకుండా ఇటీవల మంత్రి సబితా ఇంద్రరెడ్డి మాట్లాడుతూ ఈసారి కచ్చితంగా ఇంట‌ర్ ప‌రీక్ష‌లు జ‌రుగుతాయ‌ని చెప్పిన సంగ‌తి తెలిసిందే.

ఇంట‌ర్ ప‌రీక్ష ఫీజు గ‌డువు పెంపు

ఇంట‌ర్ బోర్డు ప‌రీక్ష ఫీజు చెల్లింపు గ‌డువును పెంచింది. ఇంత‌క‌ముందు ఇచ్చిన ఆదేశాల మేర‌కు ఆల‌స్య రుసం లేకుండా ఈ నెల 24లోగా చెల్లించాల్సి ఉంది. అయితే.. కాలేజీల‌కు ఈ నెల 30 వ‌ర‌కు సెల‌వులు పొడిగించినందున ఫీజు గ‌డువును ఫిబ్ర‌వ‌రి 4 వ‌ర‌కు పెంచారు. రూ.200 ఆల‌స్య రుసుముతో ఫిబ్ర‌వ‌రి 10, రూ.1000 రుసుముతో 17, రూ.2వేల‌తో ఫిబ్ర‌వ‌రి 24 వ‌ర‌కు చెల్లించ‌వ‌చ్చున‌ని కార్య‌ద‌ర్శి జ‌లీల్ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు.

Next Story