హైదరాబాద్: పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు పరీక్షలు జరగనున్నాయి. అయితే 7 పేపర్లను 35 రోజుల పాటు నిర్వహించడం సరికాదని తెలంగాణ స్టేట్ యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ (టీఎస్‌యూటీఎఫ్) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే టెన్త్ ఎగ్జామ్ షెడ్యూల్ వివాదంపై స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ వివరణ ఇచ్చారు. 'పేరెంట్స్, స్టూడెంట్స్ అభ్యర్థనతో పరీక్షల మధ్య తగినంత గ్యాప్ ఇచ్చాం. సీబీఎస్‌ఈ, ఇతర బోర్డుల విధానాలను అధ్యయనం చేసి సైంటిఫిక్‌గా షెడ్యూల్ రూపొందించాం. మ్యాథ్స్, సైన్స్, సోషల్‌కు ఎక్కువ రోజులు సెలవులు ఇచ్చాం. విద్యార్థులు ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా రివిజన్ చేసుకోవచ్చు' అని తెలిపారు.
మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు టెన్త్ ఎగ్జామ్స్ నిర్వహించనున్నట్టు విద్యాశాఖ ప్రకటించింది. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. సీబీఎస్‌ఈ పరీక్షల తరహాలో ఎగ్జామ్స్ మధ్య గ్యాప్ ఇచ్చారు. ఒక్కో పరీక్షకు మధ్య 4 నుంచి 5 రోజుల సమయం ఉంది. విద్యార్థుల ప్రిపరేషన్‌కు ఇది ఉపయోగపడనుంది. అయితే ఈ పెద్ద మొత్తం గ్యాప్‌పై టీఎస్‌యూటీఎఫ్ అభ్యంతరం వ్యక్తం చేసింది. అశాస్త్రీయంగా రూపొందించిన ఎస్‌ఎస్‌సీ టైమ్ టేబుల్‌ను వెంటనే మార్చాలని డిమాండ్ చేసింది.