టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల
AP Tenth Supplementary Results Released. ఏపీ 10వ తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు రిలీజయ్యాయి. విజయవాడలో విద్యాశాఖ మంత్రి
By అంజి Published on 3 Aug 2022 10:53 AM ISTఏపీ 10వ తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు రిలీజయ్యాయి. విజయవాడలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలను రిలీజ్ చేశారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన పరీక్షల్లో 2,01,627 మంది ఫెయిల్ అయ్యారు. ఉత్తీర్ణత 67.26 శాతం వచ్చింది. అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ రాసినవారికి సైతం గ్రేడ్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే పరీక్ష ఫీజుకు కూడా మినహాయింపు ఇచ్చింది. జులై 6 నుంచి 15 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించారు. 1,91,600 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఫలితాల్లో బాలికలు 68.76 శాతం, బాలురు 60.83 శాతం ఉత్తీర్ణత సాధించారు. https://resultsbse.ap.gov.in/లో విద్యార్థులు తమ ఫలితాలు చూసుకోవచ్చు.
గత రెండేళ్లలో కోవిడ్ కారణంగా తరగతులు జరగకపోవడంతో పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం తగ్గిందని మంత్రి బొత్స తెలిపారు. దీంతో సప్లిమెంటరీ నిర్వహించి, రెగ్యులర్‌గా పాస్ అయిన విద్యార్థులతో సమానంగా గుర్తింపు ఇస్తున్నామని చెప్పారు. ప్రకాశం జిల్లాలో 87.52 శాతం అత్యధికంగా పాస్ కాగా, పశ్చిమగోదావరి జిల్లాలో అత్యల్పంగా 46.66 శాతం పాస్ అయ్యారని తెలిపారు. విద్యార్థులతో చూసి రాయించటం, అందరినీ పాస్ చేయాలనే ఉద్దేశంతో ఈ సప్లమెంటరీ పరీక్షలు నిర్వహించలేదన్నారు.
సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన వారిని 2022-ఏప్రిల్ రెగ్యులర్ బ్యాచ్ విద్యార్థులతో సమానంగా ప్రభుత్వం పరిగణించనుంది. నిబంధనల ప్రకారం.. రెగ్యులర్ పరీక్షల్లో ఉత్తీర్ణులకు వారికి వచ్చిన మార్కులను అనుసరించి ఫస్ట్, సెకండ్, థర్డ్ డివిజన్‌లలో పాసైనట్లుగా సర్టిఫికెట్లు ఇస్తారు. సప్లిమెంటరీలో పాసైన వారికి మాత్రం ఎన్ని మార్కులు వచ్చినా కంపార్టుమెంటల్ పాస్‌గానే పరిగణిస్తారు. కానీ ఈ సారి సప్లిమెంటరీ పరీక్షలకు వర్తించే 'కంపార్టుమెంటల్ పాస్'ను మినహాయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.