10th Exams: నేటి నుండి పరీక్షా కేంద్రాల దగ్గర 144 సెక్షన్
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సోమవారం నుంచి ప్రారంభం కానున్న ఎస్‌ఎస్‌సీ పరీక్షలకు విద్యా, రెవెన్యూ, ఇతర శాఖలు విస్తృత
By అంజి Published on 3 April 2023 3:16 AM GMT10th Exams: నేటి నుండి పరీక్షా కేంద్రాల దగ్గర 144 సెక్షన్
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సోమవారం నుంచి ప్రారంభం కానున్న ఎస్‌ఎస్‌సీ పరీక్షలకు విద్యా, రెవెన్యూ, ఇతర శాఖలు విస్తృత ఏర్పాట్లు చేశాయి. పరీక్షలు ఏప్రిల్ 18న ముగుస్తాయి. ఎస్‌ఎస్‌సీ పరీక్షలు, ఓపెన్ స్కూల్ పరీక్షలు (OSSC) సోమవారం నుండి ప్రారంభం కానున్నాయి. 3,349 కేంద్రాల్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టింది. అన్ని కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించనున్నట్లు పోలీసులు తెలిపారు.
మధ్యాహ్నం ఓపెన్ స్కూల్ పరీక్షలు జరగనున్నాయి. సప్లిమెంటరీ విద్యార్థులతో సహా మొత్తం 6.5 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. సప్లిమెంటరీ అభ్యర్థులతో సహా 1672 మంది విద్యార్థులు ఓపెన్ స్కూల్ పరీక్షల కోసం హాజరవుతారు. ప్రభుత్వ పరీక్షల సంచాలకులు డి.దేవానందరెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులు ఉదయం 8.45 గంటలకే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని తెలిపారు. ఆ సమయం తర్వాత ఎవరినీ లోపలికి అనుమతించరు. విద్యార్థులు తమ హాల్‌టికెట్‌లను చూపడం ద్వారా పరీక్షా కేంద్రాలకు చేరుకోవడానికి, అక్కడి నుండి వారి వారి ప్రాంతాలకు ఉచితంగా ఆర్టీసీ బస్సు సేవలను ఉపయోగించుకోవచ్చు అని ఆయన చెప్పారు.
విజయవాడలోని పటమట జెడ్పీ హైస్కూల్‌లో పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్ సురేష్‌కుమార్, పరీక్షల విభాగం డైరెక్టర్ దేవానందరెడ్డి, ఇతర అధికారులు ఏర్పాట్లను పరిశీలించారు.
నెల్లూరు జిల్లా లోని పదో తరగతి పరీక్షలు జరుగుతున్న కేంద్రాల వద్ద సోమవారం నుంచి 144 సెక్షన్ అమలులో ఉంటుందని నెల్లూరు జిల్లా ఎస్పీ సీహెచ్ విజయరావు స్పష్టం చేశారు. పరీక్షా కేంద్రాల పరిధిలో జిరాక్స్ షాపులు పరీక్షల సమయంలో మూసివేయాలని చెప్పారు. ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా షాపులు తెరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.