ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్రాంతి సెలవులపై క్లారిటీ వచ్చేసింది. పాఠశాలలకు ఇస్తున్న సంక్రాంతి సెలవుల్లో స్వల్ప మార్పులు చేస్తూ తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులు జారి చేసింది. ఈ నెల 12 నుంచి 18 వరకు సంక్రాంతి సెలవులు ప్రకటించింది. తిరిగి 19న తేదీన పాఠశాలలు పునఃప్రారంభం అవుతాయని పేర్కొంది. 17న ముక్కునుమ ఉన్ననేపథ్యంలో సెలవు ఇవ్వాలని ఉపాధ్యాయ సంఘాల నుంచి వచ్చిన వినతుల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది.
వాస్తవానికి అకడమిక్ క్యాలెండర్ ప్రకారం జనవరి 11 నుంచి 16 వరకు సెలవులు ఇవ్వాలని ముందుగా నిర్ణయించారు. అయితే.. సంక్రాంతి సెలవుల్లో మార్పులు కోరుతూ ఉపాధ్యాయ సంఘాలు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణను కలిశాయి. అందుకు మంత్రి సానుకూలంగా స్పందించారు. అయితే.. అకడమిక్ క్యాలెండర్ చెదరకుండా ఉండేందుకు ఏదో ఒక సెలవు రోజు పనిచేసేలా షరతుతో సెలవు పొడిగిస్తున్నట్లు విద్యాశాఖ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు ఈ నెల 9వ తేదీ నుంచి సంక్రాంతి సెలవులను ప్రకటించారు. 9వ తేదీ నుంచి 17వ తేదీ వరకూ హైకోర్టుకు సెలవులు ఉండనున్నాయి. అయితే.. 10, 12 తేదీల్లో వెకేషన్ బెంచ్లో అత్యవసర కేసులను విచారించనున్నట్లు న్యాయస్థానం తెలిపింది.