ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విద్యార్థులకు శుభవార్త. ఆగస్టు27న విద్యా సంస్థలకు సెలవు దినంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ నెల(ఆగస్టు) 13న రెండో శనివారం సెలవు దినమైనప్పటికీ.. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా పాఠశాలలు, విద్యాసంస్థలు అన్ని పనిచేశాయి. దీంతో ఆగస్టు 13 సెలవునకు ప్రత్యామ్నాయంగా ఆగస్టు 27న సెలవు దినంగా ప్రకటిస్తూ విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయాన్ని విద్యార్థులు, టీచర్లు గమనించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తైన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరిట పలు కార్యక్రమాలకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో డ్యాన్స్, మ్యూజిక్, ర్యాలీలు, పెయింటింగ్, గ్రూప్ డిస్కషన్స్, జాతీయ జెండాలతో సెల్ఫీ దిగి అప్ లోడ్ చేయడం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. అందుకనే ఆగస్టు 13న రెండో శనివారం అయినప్పటికీ పాఠశాలలు యథావిధిగా పని చేశాయి. అందుకు బదులు రేపు(ఆగస్టు27) నాలుగో శనివారం సెలవు దినంగా ప్రకటించింది.