ఏపీలో ఇంటర్ ఫలితాలు విడుదల.. ఇక్కడ చూసేయండి..
ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ బోర్డు అధికారులు ఇంటర్మీడియెట్ పరీక్షా ఫలితాలను విడుదల చేశారు.
By Srikanth Gundamalla Published on 12 April 2024 11:36 AM IST
ఏపీలో ఇంటర్ ఫలితాలు విడుదల.. ఇక్కడ చూసేయండి..
ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ బోర్డు అధికారులు ఇంటర్మీడియెట్ పరీక్షా ఫలితాలను విడుదల చేశారు. విద్యార్థులు పరీక్షలు రాశాక.. ఫలితాలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చేస్తున్న నేపథ్యంలో త్వరగానే ఫలితాలను వెల్లడించారు. తాడేపల్లిలోని ఇంటర్మీడియెట్ విద్యా కార్యాలయంలో ఇంటర్ బోర్డు కార్యదర్శి ఈ ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్ ప్రథమ సంవత్సరం, రెండో సంవత్సవరం ఫలితాలను ఒకేసారి విడుదల చేశారు. ఈ మేరకు ఉత్తీర్ణత శాతాన్ని కూడా ప్రకటించారు. ఫలితాల్లో బాలికలు పైచేయి సాధించారు. మొదటి సంవత్సరంలో బాలికలు 71 శాతం, బాలురు 64 శాతం పాసయ్యారు. రెండో సంవత్సరంలో బాలికలు 81 శాతం, బాలురు 75 శాతం ఉత్తీర్ణత సాధించారు.
ఇంటర్మీడియెట్ ఫస్ట్ ఇయర్‌లో 67 శాతం మంది ఉత్తీర్ణత సాధించారని ఇంటర్ బోర్డు కార్యదర్శి వెల్లడించారు. ఇక ఇంటర్ రెండో సంవత్సరం ఫలితాల్లో 78 శాతం ఉత్తీర్ణత నమోదు అయినట్లు ప్రకటించారు. మొదటి సంవత్సరం ఫలితాల్లో 84 శాతం ఉత్తీర్ణతతో కృష్ణా జిల్లా మొదటి స్థానంలో నిలబడిందని తెలిపారు. ఆ తర్వాత 81 శాతంతో గుంటూరు జిల్లా రెండో స్థానంలో, 79 శాతం ఉత్తీర్ణతతో ఎన్టీఆర్ జిల్లా మూడో స్థానంలో నిలిచాయని తెలిపారు. ఇక సెకండ్ ఇయర్ ఫలితాల్లో 90 శాతం ఉత్తీర్ణతతో కృష్ణా జిల్లా మొదటి స్థానాన్ని నిలబెట్టుకున్నట్లు చెప్పారు. ఇక 87 శాతంతో రెండో స్థానంలో గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలు నిలవగా.. విశాఖ జిల్లాలో 84 శాతం ఇంటర్ సెకండియర్ విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు.
కాగా.. ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చి 1వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జరిగాయని చెప్పారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్‌కు సంబంధించి 5,17,617 మంది విద్యార్థులు, రెండో సంవత్సరానికి సంబంధించి 5,35,056 మంది పరీక్ష ఫీజు చెల్లించారు. వీరిలో 9,99,698 మంది పరీక్షలు రాశారని ఇంటర్ బోర్డు అధికారులు చెప్పారు. పరీక్షలు ముగిసిన 22 రోజుల వ్యవధిలోనే ఫలితాలను అధికారులు వెల్లడించారు. ఇక ఏపీకి చెందిన ఇంటర్ విద్యార్థులు తమ ఫలితాలను చెక్ చేసుకోవడానికి ఇంటర్ బోర్డు అధికారిక వెబ్ సైట్ https://resultsbie.ap.gov.in లో చూడవచ్చు.