తెలుగు రాష్ట్రాల ప్రజలకు పెద్ద పండుగగా సంక్రాంతిని చెబుతుంటారు. ముఖ్యంగా ఏపీలో సంక్రాంతి పండుగను పెద్ద ఎత్తున జరుపుకుంటారు. ముగ్గులు, పిండి వంటలు, కోడిపందాలతో వారంరోజుల పాటు హంగామా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి సెలవుల తేదీలను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆరు రోజుల పాటు సెలవులు ప్రకటిస్తున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. ఈనెల 12 నుంచి 17వ తేదీ వరకు ఆరు రోజుల పాటు సెలవులు ఇచ్చింది. విద్యార్థులు పండుగను కొవిడ్ నిబంధనలు అనుసరిస్తూ జరుపుకోవాలని ప్రభుత్వం సూచించింది.
ఐతే ఈనెల 9వ తేదీన రెండో శనివారం రోజున పాఠశాలలకు సెలవును రద్దు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీనికి బదులుగా ఈనెల 16న అంటే మూడో శనివారంనాడు సెలవు ఇవ్వనున్నారు. 11, 12న ఇస్తున్న సెలవులకు ఏదో ఒక నెలలో వారం రోజులు అదనంగా ఒక గంట పాఠశాల నిర్వహించాలి. ప్రస్తుతం మధ్యాహ్నం 1.30 గంటలకు పాఠశాలలు ముగుస్తున్నందున అదనంగా 2.30 గంటల వరకు వారం రోజులు పని చేయాల్సి ఉంటుంది.
కొవిడ్ కారణంగా ఈ విద్యాసంవత్సరం దాదాపు ఆరు నెలలు ఆలస్యంగా ప్రారంభమైంది. మొదట ప్రకటించిన షెడ్యూలు ప్రకారం 7, 8 తరగతులకు జనవరి 23 నుంచి ఫార్మేటివ్ పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉండగా వాటిని ఫిబ్రవరికి వాయిదా వేశారు. ఫిబ్రవరి 8, 9, 10 తేదీల్లో పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. 9, 10 తరగతులకు జనవరి 6 నుంచి ఫార్మేటివ్ పరీక్షలు జరుగనున్నాయి.