ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి పరీక్ష ఫలితాలు నేడు(శనివారం) విడుదల కానున్నాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఇప్పటికే విద్యాశాఖ పూర్తి చేసింది. ఈ రోజు ఉదయం 11 గంటలకు విజయవాడలో పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి. రాజశేఖర్ ఫలితాలను విడుదల చేయనున్నారు. గతంలో గ్రేడ్ విధానంలో ఫలితాలను ప్రకటించగా.. ఈ సారి గ్రేడ్లకు బదులు మార్కులు ఇవ్వనున్నారు.
కరోనా మహమ్మారి కారణంగా రెండు సంవత్సరాలుగా పదో తరగతి పరీక్షలు నిర్వహించకుండానే విద్యార్థులను పాస్ చేశారు. ఈ సారి కరోనా తగ్గుముఖం పట్టడంతో ఏప్రిల్ 27 నుంచి మే 9 వరకు పరీక్షలు నిర్వహించారు. 6,22,537 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్ష ఫీజులను చెల్లించారు. ఇందులో 3,02,474 మంది బాలికలు, 3,20,063 మంది బాలురు ఉన్నారు.
ఫలితాలను ఇలా తెలుసుకోండి..
పదో తరగతి పరీక్షా ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ అయిన https://bse.ap.gov.in/ ఓపెన్ చేసి తెలుసుకోవచ్చు. వెబ్ సైట్ ఓపెన్ చేసి వెంటనే రిజల్ట్ లింక్ ను క్లిక్ చేయాలి. ఆ తరువాత అక్కడ ఉన్న బాక్స్ లో హాల్ టికెట్ నెంబర్, తదితర వివరాలను ఎంటర్ చేసి ఫలితాలను తెలుసుకోవచ్చు.
జులై మొదటి లేదా రెండో వారంలో అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది.