ఇంటర్ విద్యార్థులకు శుభవార్త.. ప్రశ్నల్లో 50 శాతం ఛాయిస్..!
50 Percent choice in question paper in inter exams. ఇంటర్ పరీక్ష ప్రశ్నాపత్రాల్లో ఈ సారి ఛాయిస్ 50శాతానికి పెరగనుంది.
By తోట వంశీ కుమార్ Published on 27 Jan 2021 7:52 AM GMTతెలంగాణలోని ఇంటర్ విద్యార్థులకు త్వరలోనే ఇంటర్ బోర్డు శుభవార్త చెప్పనుంది. కరోనా మహమ్మారి కారణంగా ఈ విద్యా సంవత్సరం ఆలస్యంగా ప్రారంభంకావడంతో.. వార్షిక పరీక్షలను 70 శాతం సిలబస్‌తో నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇక పరీక్ష ప్రశ్నాపత్రాల్లో ఈ సారి ఛాయిస్ 50శాతానికి పెరగనుంది. ఈ మేరకు ఇంటర్‌బోర్డు ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపనుంది. కరోనా పరిస్థితుల కారణంగా విద్యార్థులకు కొంత వెసులుబాటు ఇవ్వాలని భావించిన బోర్డు.. ఇటీవల ఛాయిస్ పెంపుపై సుదీర్ఘంగా చర్చించారు.
ఇంటర్ మొదటి, ద్వితియ సంవత్సరాల ప్రశ్నపత్రాల్లో.. ముఖ్యంగా ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో ప్రతి దాంట్లో మూడు సెకన్లు ఉండగా.. రెండింటిలో 50శాతం ఛాయిస్ ఇవ్వనున్నారు. అంటే.. 6 ప్రశ్నలు ఉంటే.. కేవలం మూడు ప్రశ్నలకే సమాధానాలు రాయాల్సి ఉంటుంది. కాగా.. ఇప్పటి వరకు కేవలం ఒకటి లేదా రెండు ప్రశ్నలే ఛాయిస్ కింద ఉండేవి.
ఉదాహరణకు మ్యాస్(గణితం) ప్రశ్నాపత్నంలో..
సెక్షన్లు - ఇప్పటి వరకూ - జరగబోయే పరీక్షల్లో
సెక్షన్-ఏ - 10కి 10కి రాయాలి - మార్పు లేదు
సెక్షన్-బి - 7 ప్రశ్నలకు 5 రాయాలి - 10కి 5 మాత్రమే రాయాలి
సెక్షన్-సి - 7 ప్రశ్నలకు 5 రాయాలి - 10కి 5 మాత్రమే రాయాలి
తరగతుల నిర్వహణలో స్వల్ప మార్పులు
ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఇంటర్ కాలేజీలు పునఃప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. అయితే ఇంటర్ తరగతుల నిర్వహణలో గతంలో జారీ చేసిన ఆదేశాల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. గతంలో ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం.. 300 మంది లోపు విద్యార్థులు, తగిన వసతి ఉంటే ఉదయం 9:30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కాలేజీలు నడుపుకోవచ్చు అని ఉత్తర్వుల్లో పేర్కొంది. అంతకు మించి ఉంటే రెండు షిఫ్టుల్లో ఉదయం 8:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు, తిరిగి 1:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు జరుపుకోవాలని సూచించింది. కానీ ఈ నిబంధనలను ఇంటర్ బోర్డు తాజాగా మారుస్తూ ఉత్తర్వులిచ్చింది. ఒకరోజు ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు బోధిస్తే, మరుసటి రోజు ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు పాఠాలు బోధించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.