చెన్నై సూపర్ కింగ్స్ కు మరో కోలుకోలేని దెబ్బ

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  21 Oct 2020 2:43 PM GMT
చెన్నై సూపర్ కింగ్స్ కు మరో కోలుకోలేని దెబ్బ

ఈ ఏడాది ఐపీఎల్ లో ఏ జట్టుకు కూడా లేని కష్టాలు చెన్నై సూపర్ కింగ్స్ కు ఎదురవుతూ వచ్చాయి. కొంచెం కూడా పోరాటం చూపించకుండా ఆటగాళ్లు చేతులు ఎత్తేస్తూ ఉండడంతో చెన్నై ఓటముల మీద ఓటములను ఎదుర్కొంటూ ఉంది. ఓ వైపు ఆటగాళ్లలో నిలకడ లోపించడం.. మరో వైపు ధోని మ్యాజిక్ గ్రౌండ్ లో పని చేయకపోవడంతో చెన్నై ఓటములను చవి చూస్తూ ఉంది. ప్లే ఆఫ్ ఆశలను వదిలేయకూడదు అంటే అన్ని మ్యాచ్ లు గెలవాల్సిన తరుణంలో చెన్నై కు ఊహించని షాక్ తగిలింది.

ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావో గాయం కారణంగా ఈ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. గత కొన్నిరోజులుగా గాయంతో బాధపడుతున్న బ్రావో కోలుకునే పరిస్థితి లేకపోవడంతో జట్టు నుంచి వైదొలుగుతున్నాడని అధికారికంగా ప్రకటన వచ్చింది. ఈ మేరకు చెన్నై జట్టు సీఈవో విశ్వనాథన్ ఓ ప్రకటన చేశారు. తాజా ఐపీఎల్ సీజన్ లో 10 మ్యాచ్ లు ఆడిన చెన్నై 7 మ్యాచ్ లలో ఓటమిపాలైంది. ఆ జట్టుకు ప్లే ఆఫ్ అవకాశాలు ఇక లేనట్టే..!

ఇప్పటికే ఈ సీజన్ మొదట్లోనే రైనా జట్టు నుండి వైదొలగ్గా.. హర్భజన్ కూడా దూరమయ్యాడు. ధోని కూడా మునుపటిలా ఆడడం లేదు. ఇక జడేజాను చివర్లో పంపిస్తూ ఉండడం.. బౌలర్లు మ్యాచ్ లను గెలిపించలేకుండా పోతుండడంతో చెన్నై ఆట గాడి తప్పింది. ఇక ఇప్పుడు బ్రావో కూడా టోర్నమెంట్ నుండి అవుట్ అన్న ప్రకటన రావడంతో చెన్నై అభిమానులు మరింత బాధపడుతూ ఉన్నారు.

Next Story