కుర్రాళ్లలో కసి కనిపించకే ఆడించలేదన్న ధోని
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 20 Oct 2020 2:36 PM GMTఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో ప్లే ఆఫ్స్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్.. రాజస్థాన్ చేతిలో ఓడింది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 125 పరుగులే చేసింది. స్వల్ప లక్ష్యాన్ని రాజస్థాన్ మరో 15 బంతులు మిగిలి ఉండగానే మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి చేజింగ్ చేసింది. దీంతో చెన్నై ఏడో ఓటమిని చవిచూసింది. దాదాపు ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్ర్కమించింది. పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో కొనసాగుతుంది. కాగా.. ధోని నిర్ణయాల కారణంగానే జట్టు ఓటమికి కారణమని, ఫామ్‌లో లేని ఆటగాళ్లకు పదే పదే అవకాశాలు ఇవ్వడమే చెన్నై ఓటమికి కారణమని పలువురు మాజీలు అభిప్రాయపడుతున్నారు.
మ్యాచ్ అనంతరం ఇదే విషయాన్ని ధోని దగ్గర ప్రస్తావించగా.. తమ యువ ఆటగాళ్లలో కసి కనిపించడం లేదని.. అందుకనే వారికి అవకాశం ఇవ్వలేదన్నాడు. ఈ సారి కొన్ని ప్రయోగాలు చేసామని.. అవి అందరికి నచ్చకపోవచ్చునని అన్నాడు. మైదానంలో పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంటుందని, జట్టును పదే పదే మార్చడం వల్ల జట్టులో ఆటగాళ్లకు వాళ్ల స్థానంపై అభద్రతాభావం వస్తుందన్నాడు. అందుకనే జట్టులో ఎక్కువ మార్పులు చేయలేదని తెలిపాడు.
"కొంత మంది యువ ఆటగాళ్లకు అవకాశం రాలేదన్నది వాస్తవం. అయితే.. వాళ్లలో మాకు ఆ మెరుపు కనిపించలేదు. ప్రపంచ స్థాయి బౌలర్లను ఎదుర్కొగలరన్న నమ్మకం రాలేదు. వాళ్లపై ధీమా ఉంటే అనుభవజ్జులను పక్కన పెట్టి కుర్రాళ్లను జట్టులోకి తీసుకునేవాళ్లం. ఈ రోజు ఫలితం వచ్చేసింది. దీని గురించి పట్టించుకోకుండా లీగ్ దశలో మిగిలిన మ్యాచుల్లో కుర్రాళ్లకే అవకాశం ఇస్తాం. ఇకపై వాళ్లపై ఎలాంటి ఒత్తిడి ఉండదు. స్వేచ్చగా ఆడుకోవచ్చు" అని ధోని పేర్కొన్నాడు.