ముఖ్యాంశాలు

► బాన్సువాడలో వెలుగు చూసిన నకిలీ పట్టాలు

► పోచారం ఆదేశంతో రంగంలోకి దిగిన అధికారులు

► సమగ్ర దర్యాప్తు జరిపించాలని అధికారులకు ఆదేశం

► బాధ్యులైన వారిపై క్రిమినల్‌ కేసులు

► స్వయంగా వార్డుల్లో పర్యటించి వివరాలు సేకరించిన పోచారం

తెలంగాణలోని కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గం అంటే ముందుగా గుర్తుకు వచ్చేది పోచారం శ్రీనివాస్‌రెడ్డి. ఈయన రాజకీయాల్లో అరితేరిన వ్యక్తి. ఒక వ్యవసాయ కుటుంబంలో పుట్టిన శ్రీనివాస్‌ రెడ్డి అంచలంచెలుగా ఎదుగుతూ రాష్ట్ర మంత్రి పదవులు చేపట్టి, ప్రస్తుతం అసెంబ్లీ స్పీకర్‌గా కొనసాగుతున్నారు. ఇంత మంచి పేరున్న పోచారం శ్రీనివాస్‌ రెడ్డి ఇలాకాలోనే నకిలీ పట్టాల దందా కొనసాగడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. పోచారం ఇలాకాలోనే కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. డబుల్‌బెడ్‌ రూం ఇండ్లకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని మంజూరైన 217 పట్టాలకు అదనంగా మరో 40 పట్టాలను నకిలీవిగా సృష్టించి మోసాలకు పాల్పడుతుండటం గమనార్హం. రెవెన్యూ రికార్డులో 217 మందికి పట్టాలు జారీ కాగా, ఇంకా 40 పట్టాలు ఎక్కి నుంచి వచ్చాయని అధికారులు షాకయ్యారు. తీరా ఈ 40 పట్టాల గురించి ఆరా తీస్తే అసలు విషయం బయటకు వచ్చింది.

బాన్సువాడ పట్టణ సమీపంలో ఉన్న తాడ్కోల్‌ శివారులో మూడేళ్ల క్రితం పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఇంటి స్థలం కేటాయిస్తూ అర్హులైన 217 మందికి పట్టాలు అందించారు. వారికి ప్లాట్లకు బదులు ఇళ్లు నిర్మించి ఇవ్వాలని నిర్ణయించి రూ.25 కోట్లతో 500 ఇళ్లను జీ ప్లస్‌ వన్‌ నమూనాలో బాన్సువాడ శివారులో డబుల్‌ బెడ్‌ రూమ్‌లను నిర్మించారు. అలాగే ఇంటిస్థలం లేని వారికి, నిరుపేదలకు మాత్రమే పట్టాలను అందజేయాలని రెవెన్యూ అధికారులను స్పీకర్‌ ఆదేశించారు.

డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల కోసం నకిలీ పట్టాలు

గతంలో పట్టాలు ఇచ్చిన వారికి ఇండ్లు మంజూరు చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో కొందరు అదే అదునుగా భావించి డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల కోసం నకిలీ పత్రాలు సృష్టించి దరఖాస్తు చేసుకున్నారు. కాగా, పట్టణ ప్రగతిలో పాల్గొన్న స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డికి ఈ విషయం తెలిసింది. స్పందించిన పోచారం ఈ నకిలీ పత్రాలపై విచారణ చేపట్టాలని, నకిలీ పత్రాలు సృష్టించిన వారిపై చర్యలు చేపట్టాలని, బాధ్యులైన వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని ఆర్డీవోకు స్పీకర్‌ ఆదేశించారు.

నకిలీ పట్టాలు తయారు చేసిందెవరు..?

పోచారం ఇలాకాలో నకిలీ పట్టాలు వెలుగు చూడటంతో తీవ్ర కలకలం రేపుతోంది. అసలు నకిలీ పట్టాలు ఎవరు సృష్టించారనే దానిపై అధికారులు ఆరా తీసే పనిలో పడ్డారు. ఒరిజినల్, నకిలీ పత్రాలకు ఎలాంటి పొంతన లేకుండా తయారు చేసి, నకిలీ స్టాంప్‌, నకిలీ సంతకాలు సృష్టించడం వెనుక ఎవరి హస్తం ఉందనే అంశంపై జోరుగా చర్చ జరుగుతోంది. అయితే వీటిని బాన్సువాడలో ఓ ప్రింటింగ్‌ ప్రెస్‌లో తయారు చేయించినట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నకిలీ పట్టాలు తయారు చేసిందెవరు..? వారికి రెవెన్యూ అధికారుల సహకారం ఉందా.. ? అనే కోణంలో కూడా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. నకిలీ పట్టాలు పొందిన వారి పేర్లను ఇప్పటి వరకు వెల్లడించలేదని తెలుస్తోంది.

బాధ్యులైన వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయండి: స్పీకర్‌ పోచారం

ఈ నకిలీ పట్టాల వెనుక ఎవరి హస్తం ఉంది..? అనే కోణంలో దర్యాప్తు చేపట్టాలని స్పీకర్‌ పోచారం శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ నకిలీ పత్రాలు బయటపడిన నేపథ్యంలో స్వయంగా స్పీకర్‌ పోచారం రంగంలో దిగి ఆయా వార్డుల్లో పర్యటించి వివరాలు సేకరిస్తున్నారు. బాధ్యులైన వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని అధికారులు ఆదేశించారు. ప్రస్తుతం ఆర్డీవో సెలవులో ఉండటంతో విచారణ కొంత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.