దుబ్బాక బరిలో కాంగ్రెస్‌ ఫైర్‌ బ్రాండ్‌ విజయశాంతి..?

By సుభాష్  Published on  4 Sept 2020 12:54 PM IST
దుబ్బాక బరిలో కాంగ్రెస్‌ ఫైర్‌ బ్రాండ్‌ విజయశాంతి..?

తెలంగాణలోని దుబ్బాక నియోజకవర్గంలో కాంగ్రెస్‌ జెండా ఎగురవేసేందుకు ఆ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. బలమైన నేతను రంగంలోకి దింపి దుబ్బాక నియోజకవర్గంలో పాగా వేయాలని భావిస్తోంది. ఒకప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తప్పిన ఫైర్‌ బ్రాండ్‌, తెలంగాణ రాములమ్మ విజయశాంతిని బరిలో దింపేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు సమాచారం. ఆ మహిళా నేతకు ఉమ్మడి మెదక్‌ జిల్లాపై ఉన్న పట్టే పార్టీకి కలిసి వస్తుందని కాంగ్రెస్‌ పార్టీ అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది.

కాగా, దుబ్బాక నియోజవకర్గ ఎమ్మెల్యేగా ఉన్న సోలిపేట రామలింగారెడ్డి ఇటీవల అనారోగ్యంతో మరణించారు. అప్పటి నుంచి ఈ నియోజకవర్గం పలు ప్రధాన పార్టీలు ఫోకస్‌ పెట్టాయి. ఉప ఎన్నికలపై ఎవరికి వారే జెండా ఎగురవేయాలని ఉవ్విళ్లూరుతున్నాయి. ఇందు కోసం బలమైన అభ్యర్థులను బరిలోకి దింపేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. బీజేపీ నుంచి రఘునందన్‌రావు పేరు వినిపిస్తుండగా, కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఫైర్‌ బ్రాండ్‌గా పేరున్న విజయశాంతి పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. పోటీ చేసేందుకు విజయశాంతిని కూడా సుముఖంగానే ఉన్నట్లు సమాచారం. కానీ టీఆర్‌ఎస్‌ పార్టీ మాత్రం టికెట్‌ కేటాయింపు అంశంపై ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు.

కాగా, తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పని చేసిన విజయశాంతి రాజకీయాల్లో ఫైర్‌ బ్రాండ్‌ నాయకురాలిగా గుర్తింపు పొందారు. మెదక్‌ ఎంపీగా ఆమెకు ఉమ్మడి మెదక్‌ జిల్లాపై మంచి పట్టుంది. అంతేకాకుండా నియోజకవర్గంలో చాలా పరిచయాలున్నాయి. పార్టీలకతీంగా అన్ని పార్టీలతో ఆమెకు మంచి సంబంధాలున్నాయి. అయితే దుబ్బాక ఉప ఎన్నికల పోరులో రాములమ్మ కన్న బలమైన నేత ఎవరు లేరని పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఆమె అభ్యర్థిత్వం వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. అయితే విజయశాంతి పేరును అధికారికంగా ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఉప పోరుకు సిద్ధమని సంకేతాలు

కాగా, 2014 ఎన్నికల్లో మెదక్‌ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా విజయశాంతి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. కానీ దుబ్బాకలో పరిస్థితులువేరు.. గత ఎన్నికల్లో దుబ్బాక నుంచి కాంగ్రెస్‌ సరైన అభ్యర్థి లేకున్నా రెండో స్థానం కైవసం చేసుకోగా, బీజేపీ మూడో స్థానం వచ్చింది. ఉప ఎన్నికల్లో విజయశాంతిని బరిలోకి దింపితే అన్ని రకాలుగా కలిసి వస్తుందని హస్తం పార్టీ భావిస్తున్నట్లు సమాచారం.

టీఆర్‌ఎస్‌ రామలింగారెడ్డి కుటుంబానికి టికెట్‌ ఇస్తుందా..?

కాంగ్రెస్‌ అంచనాలు ఇలా ఉంటే.. బీజేపీ నుంచి రఘునందన్‌రావు పోటీ చేసే అవకాశం ఉంది. ఆయనకే టికెట్‌ ఇచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అయితే టీఆర్‌ఎస్‌ సీటుపై ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు. ఇటీవల మరణించిన సోలిపేట రామలింగారెడ్డి కుటుంబానికి టికెట్‌ ఇచ్చేందుకు టీఆర్‌ఎస్‌ పార్టీ సముఖంగా లేనట్లు తెలుస్తోంది. రామలింగారెడ్డి కుటుంబానికి టికెట్‌ ఇవ్వవద్దని వ్యతిరేకత కూడా వస్తున్నట్లు తెలుస్తోంది. దీనినే కాంగ్రెస్‌ పార్టీ అవకాశంగా చేసుకుని రాములమ్మను రంగంలోకి దించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

అలాగే మాజీ మంత్రి ముత్యం రెడ్డి కాంగ్రెస్‌ వీడిన నాటి నుంచి దుబ్బాక నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు సరైన నాయకత్వం లేదు. 2009లో ముత్యంరెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో చేరి దుబ్బాక ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన తర్వాత ఆ స్థాయిలో ప్రజాదరణ ఉన్న మరో నాయకుడు గుర్తింపు పొందలేదు. ఇక తెలంగాణలో కీలకంగా పని చేసిన విజయశాంతి రాజకీయాల్లో ఫైర్‌ బ్రాండ్‌గా గుర్తింపు పొందారు. మెదక్‌ ఎంపీగా ఆమెకు ఉమ్మడి మెదక్‌ జిల్లాపై మంచి పట్టు ఉండటమే కాకుండా నియోకవర్గాల్లోని అన్ని గ్రామాల్లో వ్యక్తిగతంగా మంచి పరిచయాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నుంచి ఆమెకే టికెట్‌ ఇస్తే మేలని కాంగ్రెస్‌ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Next Story