ఢిల్లీ: ఉగ్రవాదులను తరలిస్తూ పట్టుబడ్డ శ్రీనగర్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు వద్ద పోలీసులకు పట్టుబడ్డ డీఎస్పీ దవీందర్‌పై ఎన్‌ఐఏ కేసు నమోదు చేసింది. కేంద్రహోంశాఖ ఆదేశాల మేరకు దవీందర్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ విచారించనుంది. దవీందర్‌ను ఎన్‌ఐఏ బృందం త్వరలో ఢిల్లీకి తీసుకురానుంది. ఇప్పటికే దవీందర్‌ ఇంట్లో ఏకే-47, గ్రనేడ్లతో పాటు పలు వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని కూడా ఫోరెన్సిక్‌ విభాగానికి తరలించనున్నారు. గత కొన్నేళ్లుగా ఉగ్రవాదులు పోలీసులకు చిక్కకుండా వారికి సాయం చేస్తాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో గత రెండు నెలలుగా జమ్ముకశ్మీర్‌ పోలీసులు దవీందర్‌పై ప్రత్యేక నిఘా పెట్టారు.

గత శుక్రవారం హిజ్బుల్‌ ముజాహిదీన్‌ ఉగ్రవాది నవీద్‌ ముస్తాక్‌ ఫోన్ సంభాషణ నిఘా సంస్థల దృష్టికొచ్చింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు చెక్‌ పోస్ట్‌ వద్ద పహారా కాసి దవీందర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు ఉగ్రవాదులు లొంగిపోతామని తన దగ్గరకు వచ్చారనీ, వారిని హెడ్‌క్వార్టర్స్‌కి తీసుకెళ్తున్నాననీ బుకాయించాడు. అయితే ఉగ్రవాదులను విచారించగా.. తామేమీ లొంగిపోవడం లేదని, తమను జమ్మూ దాటిస్తే రూ. 12 లక్షలు ఇస్తామని ఒప్పుకొన్నట్లు తెలిపారు. వీరికి శుక్రవారం రాత్రి తన ఇంట్లో ఆశ్రయమిచ్చిన దవీందర్‌.. డీఎస్పీ కారును తనిఖీ చేయరని నమ్మకంతో తన కారులో వారిని తీసుకుని బయల్దేరారు. అయితే అలాంటి అధికారాలేవీ దవీందర్‌కు లేకపోవడంతో అనుమానం వచ్చిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

ప్రస్తుతం శ్రీనగర్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ వద్ద డిప్యూటీ సూపరిండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌గా పనిచేస్తున్న దవీందర్‌ ఉద్యోగంలో చేరిన తొలినాళ్లలోనే స్వచ్ఛందంగా జమ్ముకశ్మీర్‌లోని స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌లో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా చేరారు. కశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు తీసుకొచ్చిన ఈ విభాగానికి ( ప్రస్తుతం ఎస్ఓజీ-స్పెషల్‌ ఆపరేషన్స్‌ గ్రూప్‌)కేవలం ఆరేళ్ల కాలంలో హెడ్‌గా ఎదిగారు. దవీందర్‌ను ప్రస్తుతం విధుల నుంచి సస్పెండ్‌ చేశారు. దవీందర్‌ కేసును ఎన్‌ఐఏకు అప్పగించడంపై జాతీయ కాంగ్రెస్‌ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. కావాలనే దవీందర్‌ను అరెస్ట్‌ చేశారని, ఆయన నోరు మెదపకుండా ఉండేందుకు ఎన్‌ఐఎకు ఈ కేసు అప్పగించారని కేంద్రప్రభుత్వంపై కాంగ్రెస్‌ ఫైర్‌ అయ్యింది. పుల్వామా డీఎస్పీగా దవీందర్‌ను ఉన్నప్పుడే అక్కడ భారీ ఉగ్రదాడి జరిగింది.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.