బైక్ స్టంట్స్‌పై అభ్యంతరం వ్యక్తం చేసినందుకు.. డ్రైవర్‌ను 28 సార్లు పొడిచారు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  14 July 2020 2:53 AM GMT
బైక్ స్టంట్స్‌పై అభ్యంతరం వ్యక్తం చేసినందుకు.. డ్రైవర్‌ను 28 సార్లు పొడిచారు

న్యూఢిల్లీ: బైక్ స్టంట్స్ చేస్తున్న తమను అడ్డుకున్నాడని ఓ 25 సంవత్సరాల వ్యక్తిని చంపేసిన ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. రఘుబీర్ నగర్ లో కొందరు యువకులు తమ బైక్ లతో స్టంట్స్ చేస్తుండగా ఆ వ్యక్తి అడ్డుకోగా ముగ్గురు టీనేజీ కుర్రాళ్లు దాడి చేసి చంపేశారు. చనిపోయిన వ్యక్తిని స్థానికంగా ఉంటున్న మనీష్ గా గుర్తించారు. ప్రైవేట్ కార్ డ్రైవర్ గా ఆ వ్యక్తి పని చేస్తూ ఉన్నాడు. దాడి చేసిన యువకుల వయసు 17 సంవత్సరాలని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన చోటుచేసుకున్న తర్వాత అందరూ తప్పించుకుని పారిపోడానికి ప్రయత్నించారని పోలీసులు తెలిపారు. జులై 8న ఈ ఘటన చోటుచేసుకుంది.

ఈ ఘటన మొత్తం సిసిటివిలో రికార్డు అయ్యింది. ఓ వీడియోలో మనీష్ ను ఆ యువకుల్లో ఒకడు పదునైన వస్తువుతో పొడవడం గమనించవచ్చు. రద్దీగా ఉన్న రోడ్లలో ఈ ఘటన చోటుచేసుకుంది. కత్తి పట్టుకున్న వ్యక్తిని అతడి స్నేహితులు వెనక్కు లాక్కుని వస్తున్నా కూడా మరోసారి ముందుకు వచ్చి పొడిచాడు.

డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్(వెస్ట్) దీపక్ పురోహిత్ ఈ ఘటనపై మాట్లాడుతూ వారిపై మర్డర్ కేసును ఖ్యాల పోలీసు స్టేషన్ లో రిజిస్టర్ చేయించామని తెలిపారు. సిసిటివి ఫుటేజీ ఆధారంగా ఆ యువకులను వెతికిన పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. ఆ వ్యక్తిని చంపడానికి వాడిన ఆయుధాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

డిడియు ఆసుపత్రిలో జులై 8వ తేదీన ఓ వ్యక్తిని తీసుకుని వచ్చారు. అప్పటికే అతడు చనిపోయాడని వైద్యులు ధృవీకరించారు. ఆ వ్యక్తి శరీరంపై పలు చోట్ల పదునైన వస్తువుతో గాయాలైనట్లు గుర్తించారు. ఆ తర్వాత అతడిని స్థానికుడైన మనీష్ గా గుర్తించారు అధికారులు. మనీష్ శరీరంపై మొత్తం 28 పోట్లు ఉన్నట్లు గుర్తించారు. ఛాతీ, మొండెం లపై తీవ్ర గాయాలు, చేతులు కాళ్లపై చిన్నపాటి గాయాలు అయినట్లు తెలుస్తోంది. పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో దాడి చేసిన యువకుడు ఆ స్థానికంగా కొన్ని బైక్ స్టంట్స్ చేసాడని.. విపరీతమైన వేగంతో ఆ యువకుడు వీధుల్లో తిరుగుతూ ఉండడంతో మనీష్ అతడిని వారించాడు. దీంతో మనీష్ మీద పగ పెంచుకున్న ఆ యువకుడు తన స్నేహితుల అండతో రెచ్చిపోయాడు. రెండు కత్తులు తీసుకుని వచ్చి మనీష్ మీద దాడి చేసి హతమార్చాడని పోలీసులు వెల్లడించారు.

Next Story
Share it