ఆ వెబ్‌సైట్లను ఓపెన్ చేసారో మీ పని ఖతం..
By తోట వంశీ కుమార్ Published on 26 March 2020 8:07 AM GMTకరోనా వైరస్(కొవిడ్-19) ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇప్పటికే ఈ మహమ్మారి ధాటికి 20వేల మందికి పైగా మృత్యువాత పడగా.. నాలుగున్నర లక్షల మంది కరోనా పాజిటివ్‌తో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు చాలా దేశాలు ఇప్పటికే లాన్‌డౌన్ ప్రకటించాయి. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు.
మన దేశంలో కూడా 21రోజులు పాటు లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. దీంతో ప్రజలు ఇళ్లకే పరిమితం అయ్యారు. ఇంట్లో ఉండి ఆన్‌లైన్‌లో కరోనా వైరస్ గురించి తెలుసుకుని, ఈ వైరస్ బారినపడకుండా జాగ్రత్త పడేందుకు నెటిజన్లు గూగుల్‌లో వెతుకుతున్నారు. కరోనా వైరస్‌కు సంబంధించిన ఆర్టికల్స్ చదువుతున్నారు.
ఇదే సైజర్ నేరగాళ్లుకు వరంగా మారింది. ఈ-మెయిల్, సోషల్ మీడియా, బ్యాంకింగ్ అకౌంట్లను హ్యాక్ చేసేందుకు కరోనా వైరస్ పేరుతో వెబ్‌సైట్స్ రూపొందించి నెటీజన్లకు గాలం వేస్తున్నారు. కరోనా పేరుతో ఉండడంతో ఈ విషయం తెలియని వాళ్లు ఈ వెబ్‌సైట్ లింక్‌ను క్లిక్ చేస్తున్నారు. దీంతో మీ సిస్టం కానీ, ఫోన్ గానీ సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లిపోతోంది. దీంతో తమ అకౌంట్లను రిస్క్‌లో పెడుతున్నారు. ఇలా పదుల సంఖ్యలో వెబ్‌సైట్స్ పుట్టుకొచ్చాయి. అవి ఇమెయిల్స్, ఎస్ఎంఎస్, వాట్సప్, సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి. ఆ వెబ్‌సైట్లను గుర్తించిన ఢిల్లీ సైబర్ క్రైమ్ పోలీసులు ఏఏ వెబ్‌సైట్స్ క్లిక్ చేయకూడదో ఆ వివరాలను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఢిల్లీ సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించిన వెబ్‌సైట్స్ ఇవే.
coronavirusstatus[.]space
coronavirus-map[.]com
blogcoronacl.canalcero[.]digital
coronavirus[.]zone
coronavirus-realtime[.]com
coronavirus[.]appbgvfr.coronavirusaware[.]xyz
coronavirusaware[.]xyz
corona-virus[.]healthcare
ఈ లింక్స్ ఎక్కువగా ఇమెయిల్స్‌లో వస్తున్నాయి. కాబట్టి మీరు మెయిల్ ఓపెన్ చేసినప్పుడు అనుమానాస్పద లింక్స్ కనిపిస్తే పట్టించుకోవద్దు. వాటిని డిలిట్ చేయడం మంచిది. పొరపాటున కూడా ఎవరికీ షేర్ చేయొద్దు.