వినియోగదారులకు వాట్సప్ టెక్నికల్ టీమ్ హెచ్చరిక.. ఏమిటా హెచ్చరిక ?
By తోట వంశీ కుమార్ Published on 2 Jun 2020 8:02 PM ISTరెండు నెలల లాక్ డౌన్ కాలంలో సాధారణం కన్నా వాట్సప్ వినియోగదారుల సంఖ్య 40 శాతం పెరిగినట్లు తాజా నివేదికలు చెప్తున్నాయి. ప్రస్తుత కాలంలో చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరూ స్మార్ట్ ఫోన్లు వాడేవారే. ఒకరకంగా ఇదొక స్మార్ట్ యుగం అని చెప్పాలి. పాలుగాలే చెక్కిళ్లతో ఉండే చిన్నారులు కూడా చందమామ కథలు వింటూ అన్నం తినాల్సిందిపోయి..స్మార్ట్ ఫోన్ చూస్తే గానీ నోరు తెరవడం లేదు. స్మార్ట్ ఫోన్ మనిషి జీవితంలో ఒక భాగమైపోయింది. అది లేకపోతే మనిషి మైండ్ కూడా సరిగ్గా పనిచేయని స్టేజ్ లో ఉన్నాం మనం.
అయితే తాజాగా వాట్సప్ టెక్నికల్ టీమ్ వినియోగదారులకు ఓ హెచ్చరిక చేసింది. ఏమిటా హెచ్చరిక అనుకుంటున్నారా ? ఈ మధ్య దేనినైనా హ్యాక్ చేయడం చాలా సరదా అయిపోయింది కదా సైబర్ నేరగాళ్లకు. ఇప్పుడు వాట్సప్ ఖాతాలను కూడా అలాగే హ్యాక్ చేస్తున్నారట. ఈ విషయం వాట్సప్ టెక్నికల్ టీమ్ దృష్టికి రావడంతో మీకు వాట్సప్ కు సంబంధించి ఏదైనా మెసేజ్ వస్తే దయచేసి స్పందించకండి అంటూ అలర్ట్ చేస్తోంది. వాట్సప్ హ్యాకింగా ? అదెలా సాధ్యం అనుకుంటున్నారా ? ఇదిగో..ఇలా..
హ్యాకర్లు తెలుసుకున్న మొబైల్ నంబర్లలో వాట్సప్ అకౌంట్లు ఉన్న నంబర్లకు వాట్సప్ వెరిఫికేషన్ పేరుతో ఒక మెసేజ్ పంపుతారు. ఆ మెసేజ్ లో ఆరు అంకెల పిన్ ఉంటుంది. ఆ పిన్ నంబర్ ను వాట్సప్ రీ వెరిఫికేషన్ లో ఎంటర్ చేస్తే వెరిఫికేషన్ పూర్తవుతుందని ఆ మెసేజ్ సారాంశం. నిజంగానే మీకొచ్చిన పిన్ నంబర్ ను వెరిఫికేషన్ కోసం ఎంటర్ చేస్తే..ఇక అంతే సంగతులు. మీ వాట్సప్ లో ఉన్న మెసేజ్ లు, ఫొటోలు, వీడియోలు మొత్తం సైబర్ నేరగాళ్ల చేతికి వెళ్లిపోయినట్లే.
మీకు పిన్ నంబర్ పంపడమే కాకుండా ఆ మెసేజ్ ను మీ వాట్సప్ గ్రూప్ లలో షేర్ చేయమని ఓ రిక్వెస్ట్ కూడా ఉంటుంది ఆ మెసేజ్ లో. నిజమేననుకుని షేర్ చేస్తే మీతో పాటు వారంతా కూడా సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోతారు. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి అంటూ వాట్సప్ టెక్నికల్ టీమ్ వినియోగదారులకు విజ్ఞప్తి చేసింది. ఒకసారి వాట్సప్ ఖాతా ఓపెన్ చేశాక..మళ్లీ తాము వెరిఫికేషన్ చేయాల్సిందిగా అడగమని స్పష్టం చేసింది. ఒకవేళ పొరపాటున ఎవరైనా ఇలాంటి వెరిఫికేషన్లు చేసుకుని ఉంటే వాట్సప్ అకౌంట్ డిలీట్ చేసి, మళ్లీ వెరిఫై చేసుకుని ఖాతా రీ ఓపెన్ చేసుకోవాల్సిందిగా సూచించింది.