అలా వద్దు.. ఇలా చేయండి..!.. ప్రధాని వీడియో మెస్సేజ్
By Newsmeter.Network Published on 21 March 2020 3:05 PM ISTభారత్‌లో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తుంది. శుక్రవారం ఒక్కరోజే 60 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా.. శనివారం మధ్యాన్నానికి సుమారు 50కి పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ గణాంకాలను బట్టి చూస్తే వైరస్ భారత్‌లో ఎంత వేగంగా విస్తరిస్తుందో ఇట్లే అర్థమవుతుంది. దేశంలో ఇప్పటి వరకు 294 పాజిటివ్ కేసులు నమోదు కాగా వీరిలో 267 మంది ఐసోలేషన్ వార్డుల్లో చికిత్సపొందుతున్నారు. 23 మంది మాత్రం ఇప్పటి వరకూ రికవరీ అయ్యారు. మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. కరోనా సోకిన వారిలో భారతీయులు 256 మంది ఉండగా.. విదేశీయులు 38 మంది ఉన్నారు. దేశంలో ఇప్పటి వరకు మహారాష్ట్రంలో 63 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తరువాతి స్థానంలో కేరళ ఉంది. ఆ రాష్ట్రంలో 40 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఏపీలో మూడు, తెలంగాణలో 19మంది కరోనా వైరస్ భారిన పడి చికిత్స పొందుతున్నారు.
వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పకడ్బందీ చర్యలు చేపడుతున్నాయి. కేంద్రం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను అలర్ట్ చేసింది. ఇదిలాఉంటే ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ జనతా కర్ఫ్యూ కు పిలుపునిచ్చారు. ప్రతీ ఒక్కరూ ఇండ్లకే పరిమితం కావాలని, అత్యవసరం అయితే తప్ప ఎవరూ బయటకురావద్దని మోదీ సూచించారు. 14గంటల పాటు ఎవరూ ఇండ్ల నుంచి బయటకు రావద్దని, తద్వారా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు వీలుటుందని తెలిపారు. ఎవరూ గుంపులు గుంపులు ఉండొద్దని, ప్రతీ ఒక్కరూ అప్రత్తంగా ఉండాలని ప్రధాని సూచించారు. అదేవిధంగా జనతాకర్ఫ్యూ సందర్భంగా రైల్వే శాఖ దాదాపు అన్ని రైళ్లను రద్దు చేసింది. మరోవైపు పలు రాష్ట్రాల్లో మెంట్రో సేవలను నిలిపివేశారు. ఏపీ, ఇతర రాష్ట్రాల్లో దూర ప్రాంతాలకు ఆర్టీసీ సేవలను బంద్ చేయించారు. బస్టాండ్, ఇతర కూడళ్లలో ఎవరూ గుంపులు గుంపులుగా ఉండొద్దని ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హెచ్చరించాయి.
ఇదిలాఉంటే ప్రధాని నరేంద్ర మోదీ తాజాగా ఓ వీడియోను విడుల చేశారు. మనం పాటించే చిన్న చిన్న జాగ్రత్తలే గొప్ప ప్రభావం చూపుతాయి.. తద్వారా ఎంతో మంది ప్రాణాలను కాపడతాయి అంటూ కరోనా వైరస్ ఎలా వ్యాపిస్తుంది, అది వ్యాపించకుండా ఎలా జాగ్రత్త పడాలనే విషయాన్ని కళ్లకు కట్టినట్లు తెలియజేసే వీడియోను తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేశారు. ఈ వీడియో మన చేతికి తాకిన వైరస్ ఏ విధంగా ఇతరులకు వ్యాపిస్తుంది, దాని నుంచి ప్రజలకు ఎలా వ్యాప్తిచెందుతుంది అనే విషయాలను వీడియోలో పేర్కొన్నారు.