వారిని అడ్డుకోవద్దు..

By Newsmeter.Network  Published on  4 April 2020 10:01 AM GMT
వారిని అడ్డుకోవద్దు..

కరోనా మహమ్మారితో ప్రపంచం వణికిపోతోంది. భారత్‌లోనూ వేగంగా విస్తరిస్తున్న కరోనా.. ఇటు ఏపీలోనూ విజృంభిస్తోంది. ఏపీలో ఇప్పటికే 180 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. ఒకరు మృతి చెందారు. ఇదిలా ఉంటే కరోనా వ్యాప్తిని అరికట్టేదుకు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తుంది. దీనిలో భాగంగా దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను విధించింది. ఏపీలోనూ లాక్‌డౌన్‌ పడక్బందీగా కొనసాగుతుంది. గత నెల 24 నుంచి ప్రజలంతా ఇండ్లకే పరిమితమయ్యారు. రవాణా వ్యవస్థ పూర్తిగా నిలిచిపోయింది. ఈ లాక్‌డౌన్‌తో అన్నదాతలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

Also Read : కుమార్తె మృతి.. వీడియో కాల్‌లోనే అంత్యక్రియలు వీక్షించిన తండ్రి

ప్రస్తుతం పంటలు కోతకు రావటం, వాటిని మార్కెట్‌లకు తరలించే ప్రయత్నాల్లో వారిని పోలీసులు అడ్డుకోవటంతో తీవ్రంగా నష్టపోతున్నారు. లాక్‌డౌన్‌ నుంచి నిత్యావసర వస్తువులు, కూరగాయలు, పండ్లకు మినహాయింపు ఇచ్చినా పోలీసులు నిలిపివేస్తుండటంతో ప్రజలకు సరిపడా సరుకులు అందుబాటులోకి రావడం లేదు. దీంతో ఉద్యానవనశాఖ కమిషనర్‌ చిరంజీవి చౌధరి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాశారు. ఉద్యాన పంటల రవాణా, ఎగుమతి, శుద్ది సేకరణ, రైతు బజార్లకు, స్థానిక మార్కెట్లకు తరలింపు వంటి వాటికి గతంలో వినహాయింపు ఇచ్చినా సక్రమంగా అమలు కావటం లేదని, మరోసారి జిల్లా కలెక్టర్లకు ఉత్తర్వులు ఇస్తూ ఈ మినహాయింపు అమలయ్యేలా చూడాలని కోరారు. ఈమేరకు జగన్‌ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో పూలు, పండ్లు, కూరగాయలు, మిర్చి, పసుపు రైతులకు ఊరటనిస్తూ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పంటల రవాణాకు ప్రాధాన్యతనివ్వాలని, ఎలాంటి ఆటంకం కలుగకుండా వ్యవసాయ మార్కెటింగ్‌ శాఖ, ఉద్యాన శాఖ ఉన్నతాధికారులు ఇచ్చే ఉత్తర్వులు కచ్చితంగా అమలు చేసేలా చర్యలు చేపట్టాలని ఆయా జిల్లా కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది.

Also Read :12 తరువాతే నిర్ణయం తీసుకుంటాం

Next Story