10వ తరగతి పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేయలేదు.. వదంతులు నమ్మొద్దు
By తోట వంశీ కుమార్ Published on 9 May 2020 3:16 PM GMT
ఏపీలో పదవతరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల చేశారంటూ సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మవద్దని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ చిన వీరభద్రుడు విజ్ఞప్తి చేశారు. కొందరు పరీక్షల విషయంలో విద్యార్థులను తప్పు దారి పట్టిస్తున్నారని.. పదవ తరగతి పరీక్షలకు సంబంధించి ఫేక్ న్యూస్ లను సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తున్నారని తెలిపారు.
మొన్న టైమ్ టేబుల్ విషయంలో వదంతులు సృష్టించగా, నేడు ఏకంగా తన పేరును ఫోర్జరీ చేసి రాష్ట్రంలో ఈ నెల 15 నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షలంటూ తప్పుడు సమాచారాన్ని ఉంచారని తెలిపారు. వీటిపై ఉపేక్షించేది లేదన్నారు. ఇలాంటివి సైబర్ నేరాల కిందకు వస్తుందన్నారు. ఇలాంటి అసత్య ప్రచారాలను చేస్తున్న వారిపై ఫిర్యాదు చేస్తామన్నారు. ఇలాంటి వార్తల వల్ల విద్యార్థులు మానసికంగా ఆందళోన చెందుతున్నారని, వారిని గందరగోళానికి గురిచేయడం సరికాదన్నారు. పదవ తరగతి పరీక్షలపై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. లాక్‌డౌన్ ముగిసిన అనంతరం చర్చించి పరీక్షల తేదీలను వెల్లడిస్తామన్నారు.