మద్యం షాపులను తగ్గిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు
By తోట వంశీ కుమార్ Published on 9 May 2020 5:00 PM ISTఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దశల వారీగా మద్యపాన నిషేధాన్ని అమలులోకి తెచ్చే దిశగా ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. అందులో భాగంగానే రాష్ట్రంలో మరో 13శాతం మద్యం దుకాణాలు తొలగిస్తూ శనివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రాష్ట్రంలో మద్యం దుకాణాల సంఖ్య 2934కు తగ్గనుంది. ఈ నెలాఖరు నాటికి షాపులను తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. కాగా.. గతంలోనే రాష్ట్ర ప్రభుత్వం 20 శాతం దుకాణాలను తగ్గించిన విషయం తెలిసిందే.
ఇప్పటికే 43వేల బెల్టు షాపులను తొలగించడంతో పాటు, 40 శాతం బార్లును గతంలోనే తగ్గించింది. అదనపు ఎక్సైజ్ రీటైల్ టాక్స్ పేరిట ధరలు పెంచినట్లు తెలిపింది. ఒక వ్యక్తికి బీర్లు, మద్యం విక్రయాలను 3 సీసాలకు మాత్రమే పరిమితం చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. మద్యం దుకాణాల వద్ద పర్మిట్ రూంలను కూడా తొలగించింది. ఇక మద్యం అమ్మకాల వేళ్లలోనూ మార్పులు చేసింది. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మద్యం విక్రయాలు చేపట్టాలని సూచించింది.