దాడులకు భయపడొద్దు.. భయపడితే అలానే ఉండిపోతాం : పవన్
By Newsmeter.Network
జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్ర వరంలో జరిగిన కార్యక్రమంలో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో ప్రతికూల పవనాలు ఉన్నప్పుడే తాను రాజకీయాల్లోకి అడుగుపెట్టానని, ఒక్కో సమస్యను ధైర్యంగా ఎదుర్కొంటూ వస్తున్నానని అన్నారు. పిరికివాడిగా తాను బతకాలని అనుకోవటం లేదని, పిరికి సమాజానికి ధైర్యం పోయాలనే జనసేన పార్టీ స్థాపించానని అన్నారు. పవన్ సినిమాల్లోకి వస్తే.. తన స్థాయి చాలా తక్కువగా ఉంటుందని పలువురు అప్పట్లో మాట్లాడారని, తనతో సినిమా తీస్తే దాదాపు రూ.70లక్షలతో తీయాలని కొందరు అన్నారని అన్నారు. కానీ తన స్థాయి ఏంటో సినిమాల్లో నిరూపించుకున్నారని పవన్ తెలిపారు.
తనలో పిరికితనంపై చిన్నప్పటి నుండే పోరాడానని, మనల్ని భయపెట్టే పరిస్థితుల్ని ఎదుర్కొనకపోతే.. మనలో ధైర్యం అనే కండ పెరగదన్నారు. దాడులకు భయపడితే అలాగే ఉండిపోతామని, ఓటమిని ఎదుర్కోవాలంటే చాలా బలమైన భవజాలం ఉండాలని పవన్ అన్నారు. మతం, కులంతో నిలబడే భావజాలం ఉండకూదడని, అందర్నీ కలుపుకొని పోయే భావజాలం ఉండాలని పవన్ పేర్కొన్నారు. ఉంటామో.. పోతామో తెలియదు గానీ భావజాలాన్ని నమ్ముకొని నిలబడతామని అది ఏ భావజాలమంటే అందరినీ కలుపుకొనేది కావాలని పవన్ అన్నారు. మతం , కులంతో ముడిపడినది కాదని, మానవత్వంపై నిలబడే భావజాలం ఉండాలని అన్నారు. నేరస్తులను ప్రోత్సహించే భావజాలం కాదని పవన్ వివరించారు.