శిశువు మరణానికి కారణమైన డాక్టర్‌పై హత్యకేసు.?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  22 Dec 2019 6:57 AM GMT
శిశువు మరణానికి కారణమైన డాక్టర్‌పై హత్యకేసు.?

ముఖ్యాంశాలు

  • సిజేరియన్ చేసే సమయంలో శిశువు దుర్మరణం
  • అచ్చంపేట ప్రభుత్వాసుపత్రిలో ఘటన
  • కేవలం తలను మాత్రమే బైటికి తీసిన డాక్టర్
  • ఈ ఘటనతో షాక్ తిన్న వైద్య సిబ్బంది
  • డాక్టర్ నిర్లక్ష్యమే కారణమని బాధితుల ఫిర్యాదు
  • డ్యూటీ డాక్టర్ పై హత్యకేసు నమోదు
  • డాక్టర్ తప్పేంలేదంటున్న డీఎంహెచ్ఓ

హైదరాబాద్: విధి నిర్వహణలో ఓ డాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడంవల్ల అప్పుడే పుట్టిన బిడ్డ ప్రాణాలు గాల్లో కలసిపోయాయన్న వార్త నాగర్ కర్నూల్ జిల్లాలో దావానలంలా వ్యాపించింది. అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ మహిళకు సిజేరియన్ చేస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. డాక్టర్ బిడ్డను బైటకు తీస్తున్న సమయంలో శిశువు దేహంనుంచి తల వేరైపోయి బయటికి వచ్చేసిందని బాధితులు ఆక్రోశాన్ని వ్యక్తం చేస్తున్నారు.

నిర్లక్ష్యంగా సిజేరియన్ చేసి బిడ్డ ప్రాణాలను బలిగొన్నారంటూ బాధితులు చేసిన ఫిర్యాదుపై అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్ సుధారాణిపై ఐ.పి.సి 304(ఎ) సెక్షన్ కింద కేసు నమోదయ్యింది. ఆసుపత్రి సూపరింటెండెంట్ తారా సింగ్ మీదకూడా దీనికి సంబంధించిన కేసు నమోదయ్యింది.

బిడ్డను పోగొట్టుకున్న దంపతులు సాయిబాబా గౌడ్, స్వాతి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తమ బిడ్డ ప్రాణాలు పోవడానికి డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమంటూ తీవ్రస్థాయి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అధికారులు మాత్రం ఇందులో తమ తప్పేంలేదనీ క్రిటికల్ కండిషన్ లో కనీసం తల్లి ప్రాణాలనైనా దక్కించగలిగామనీ చెబుతున్నారు.

నాగర్ కర్నూల్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సుధాకర్ లాల్ అంటున్నారు. కడుపులోనే బిడ్డ చనిపోవడంవల్ల టిష్యూలు బలహీనపడిపోయి అలా జరిగిందని చెబుతున్నారాయన. ఇంతకు ముందుకూడా బాధితమహిళకు ఓసారి గర్భస్రావం అయ్యిందని, రెండోసారికూడా బిడ్డ గర్భంలోనే చనిపోయిందనీ అంటున్నారు.

బాధితురాలు స్వాతికి నొప్పులు రావడంతో ఆమె బంధువులు ఆమెను అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. సిజేరియన్ చేస్తున్న సమయంలో బిడ్డ దేహం కడుపులోనే ఉండిపోయి కేవలం శిశువు తలమాత్రం బైటికి వచ్చేయడంతో షాక్ తిన్న డాక్టర్ వెంటనే ఆమెను అంబులెన్స్ లో ఆశావర్కర్ సాయంతో హైదరాబాద్ కి తరలించారు. విపత్కర పరిస్థితిలో బిడ్డ దేహాన్ని బయటికి తీసి తల్లి ప్రాణాలను కాపాడగలిగామనీ వైద్యులు చెబుతున్నారు.

డిఎంహెచ్ఓ ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. విచారణ బృందం ఆసుపత్రికి చేరుకుని దీనికి సంబంధించి విచారణ పూర్తి చేసింది. విచారణ నివేదికను ఇంకా ప్రభుత్వానికి అందజేయాల్సి ఉంది. పూర్తి స్థాయి నివేదిక అందిన తర్వాత దీనిపై చర్యలు తీసుకుంటామని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు.

Next Story