మతపరమైన సమావేశాలు నిర్వహించొద్దు.. లాక్‌డౌన్‌ నిబంధనలు పాటించాలి

By Newsmeter.Network  Published on  4 April 2020 10:40 AM GMT
మతపరమైన సమావేశాలు నిర్వహించొద్దు.. లాక్‌డౌన్‌ నిబంధనలు పాటించాలి

ఏపీలో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. శుక్రవారం ఒక్కరోజే 15 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. శనివారం మధ్యాహ్నం సమయం వరకు 16 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 180కి చేరింది. వీరిలో అత్యధికంగా ఇటీవల ఢిల్లిలో జరిగిన మతపరమైన ప్రార్థనల్లో పాల్గొని వచ్చినవారే ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలో ఏపీ గవర్నర్‌ బిశ్వ భూషన్‌ హరిచందన్‌ కీలక సూచనలు చేశారు. మతపరమైన సమావేశాలు ఎట్టిపరిస్థితుల్లో నిర్వహించొద్దని, ప్రభుత్వం నిర్ణయం తీసుకొనే వరకు లాక్‌ డౌన్‌ నిబంధనలను ప్రతీ ఒక్కరూ పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. శనివారం రాజభవన్‌లో పలువురు అధికారులతో గవర్నర్‌ భేటీ అయ్యారు. అనంతరం రాజ్‌భవన్‌ ఓ ప్రకటన విడుదల చేసింది.

Also Read :12 తరువాతే నిర్ణయం తీసుకుంటాం

కరోనా సోకిన వారిని ఐసోలేషన్‌కు పంపుతున్న సిబ్బంది పట్ల అమర్యాదగా ప్రవర్తించడం సమంజసం కాదని అన్నారు. మానవాళి మనుగడ కోసం చేపడుతున్న లాక్‌ డౌన్‌ కార్యక్రమాన్ని ప్రతీ పౌరుడు తనదిగా భావించాలని, అప్పుడే ఆశించిన ఫలితాలు సాధ్యమవుతాయని గవర్నర్‌ తెలిపారు. లాక్‌డౌన్‌ చివరి రోజు వరకు ఎటువంటి వెసులుబాటు లేకుండా పకడ్బందీగా నిబంధనలు పాటించాలని సూచించారు. మత పరమైన సదస్సులు, సమావేశాలు మంచిది కాదని, ఆ మేరకు మత పెద్దలు ప్రజలకు తగిన సూచనలు చేయాలని హరిచందన్‌ పిలుపునిచ్చారు. సాధారణంగా మత పరమైన కార్యక్రమాల వల్ల సమూహాలు ఏర్పడతాయని తాజా పరిస్థితుల్లో ఇది ఎంతమాత్రం మంచిది కాదని సూచించారు.

Also Read : కుమార్తె మృతి.. వీడియో కాల్‌లోనే అంత్యక్రియలు వీక్షించిన తండ్రి

ప్రతీ ఒక్కరూ సామాజిక దూరం పాటించాలని సూచించారు. వైద్య సేవలో నిమగ్నమైన సిబ్బందికి ప్రతీ ఒక్కరూ సహకరించాలని, కొన్ని ప్రాంతాల్లో వైద్య ఆరోగ్య సిబ్బంది విధులను అడ్డుకోవడం వంటివి చేస్తున్నార న్న సమాచారం ఆందోళన కలిగిస్తుందని, ఈ తరహా పరిస్థితులు ఏ మాత్రం వాంఛనీయం కాదని గవర్నర్‌ స్పష్టం చేశారు. వ్యవసాయ పనుల్లో సైతం సామాజిక దూరం అవసరమని , వ్యవసాయ ఉత్పత్తుల విక్రయానికి అవసరమైన అన్ని చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందని గవర్నర్‌ అన్నారు.

Next Story
Share it