కరోనాతో డీఎంకే ఎమ్మెల్యే మృతి..

By తోట‌ వంశీ కుమార్‌  Published on  10 Jun 2020 5:02 AM GMT
కరోనాతో డీఎంకే ఎమ్మెల్యే మృతి..

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కరోనా మహమ్మారి కారణంగా డీఎంకే ఎమ్మెల్యే అన్బళగన్‌(62) మృత్యువాత పడ్డారు. చెన్నైలో చికిత్స పొందుతూ ఆయన బుధవారం ఉదయం కన్నుమూశారు. ఈరోజు ఆయన పుట్టిన రోజు. పుట్టిన రోజు నాడే ఎమ్మెల్యే మరణించడం శోచనీయం. కొవిడ్‌-19 వల్ల ఓ ఎమ్మెల్యే ప్రాణాలు కోల్పోవడం ఇదే మొదటిసారి.

చెన్నైలోని చెపాక్‌ నియోజకవర్గం నుంచి అన్బళగన్‌ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మూడుసార్లు ఆయన అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2001, 2011, 2016 సంవత్సరాల్లో ఆయన గెలుపొందారు. దివంగత కరుణానిధి, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌కు సన్నిహితంగా ఉండేవారు. కొన్నాళ్లు ఈయన ఫిల్మ్‌ డిస్ట్రిబ్యూషన్‌లో కూడా ఉన్నారు. సన్‌ పిక్చర్స్‌ తీసిన సినిమాలను అన్బళగన్‌ డిస్ట్రిబ్యూట్‌ చేశారు. తమిళంలో నటుడు జయం రవితో ఆదిభగవాన్‌ చిత్రాన్ని నిర్మించారు.

కొవిడ్‌ లక్షణాలతో జూన్‌ 2న ఆయన చెన్నైలోని క్రోమ్‌పేట్‌లో ఉన్న డాక్టర్‌ రీలా ఇన్స్‌టిట్యూట్‌ అండ్‌ మెడికల్‌ సెంటర్‌లో చేరారు. పరీక్షల అనంతరం కరోనా పాజిటివ్‌గా తేలింది. రెండు రోజుల క్రితం వరకు కోలుకున్నట్లే కనిపించారు. అయితే శ్వాస తీసుకోవటం ఇబ్బందిగా మారటంతో వెంటిలేటర్‌పై ఉంచారు. అయితే రక్తపోటు, గుండె పనితీరు కూడా క్షీణించటంతో ఆయన తుదిశ్వాస విడిచారని వైద్యులు తెలిపారు. వారు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి ఆయన పరిస్థితి విషమంగానే ఉందన్నారు. అప్పటి నుంచి ఆయన 80 శాతం వెంటిలేటర్‌పైనే చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. అన్బళగన్‌ మృతి పట్ల తమిళనాడు సీఎం పళనిస్వామి, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, వివిధ పార్టీల నేతలు సంతాపం తెలిపారు.

Next Story