ఆటలోనే కాదు సాయంలోనూ నెంబర్ వన్..
By తోట వంశీ కుమార్
కరోనా వైరస్(కొవిడ్-19) ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ మహమ్మారి భారీన పడి ఇప్పటికే ఎంతో మంది ప్రాణాలు పోగోట్టుకున్నారు. లక్షల్లో దీని బాధితులు ఉన్నారు. తాజాగా ప్రపంచ టెన్నిస్ నంబర్ వన్ ఆటగాడు నోవాన్ జోకోవిచ్ కరోనా మహమ్మారిపై పోరాడేందుకు తాను సిద్దం అని ముందుకొచ్చాడు. ఇప్పటికే ఎంతోమంది క్రీడాకారులు తమ వంతు సహాయానికి సిద్ధం కాగా, జొకోవిచ్ కూడా ఆ బాటలోనే నడిచాడు. తన వంతు సాయంగా 1.1 మిలియన్ డాలర్లు(రూ. 8.28 కోట్లు) విరాళాన్ని ప్రకటించాడు. ఆక్సిజన్ సిలిండర్లు, వైద్య పరికరాలు, శానిటరీ వస్తువులను కొనుగోలు చేయడానికి ఇంత మొత్తాన్ని ఇచ్చినట్లు ఈ సెర్బియా ఆటగాడు తెలిపాడు.
కరోనా వ్యాప్తిని అరికట్టడానికి ఇప్పటికే చాలా దేశాలు లాక్‌డౌన్‌లు ప్రకటించాయి. కరోనా ముప్పుతో క్రీడా టోర్నీలు రద్దు అయిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సెర్బియా ఆటగాడు తన కుటుంబ సభ్యులతో కలిసి మార్బెల్లాలో హాయిగా కాలం గడుపుతున్నాడు. ఓ వీడియో ద్వారా స్పందించాడు. తన దేశంతో పాటు ప్రపంచంలో కరోనాతో బాధితులకు సేవలందిస్తున్న వైద్య సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేశాడు. త్వరలోనే అంతా కోలుకోవాలని జోకోవిచ్ ఆకాంక్షించాడు.
ఇక మరో టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ తన దేశంలో కరోనా ముప్పు పొంచి ఉన్న కుటుంబాలకు సాయం చేయడానికి ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. తన భార్య మిర్కాతో కలిసి 10 లక్షల స్విస్ ఫ్రాంక్స్‌ను (రూ. 7 కోట్ల 86 లక్షలు) అందజేశాడు. అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాల్ ప్లేయర్, బార్సిలోనా ఫార్వర్డ్ ఆటగాడు లియోనల్ మెస్సీ, మాంచెస్టర్ సిటీ మేనేజర్ పెప్ గార్డియోలా ఈ మహమ్మారి నియంత్రణ కోసం చెరో పది లక్షల యూరోలు (రూ. 8.32 కోట్లు) చొప్పున విరాళం ఇచ్చారు.