నిందితుల అంత్యక్రియలపై హైకోర్టు కీలక ఆదేశాలు

By Newsmeter.Network  Published on  6 Dec 2019 11:23 PM IST
నిందితుల అంత్యక్రియలపై హైకోర్టు కీలక ఆదేశాలు

ముఖ్యాంశాలు

  • ఈనెల 9 వరకు మృతదేహాలను భద్రపర్చాలన్న కోర్టు
  • పోలీసులకు ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసులు
  • రేపు మృతదేహాలను పరిశీలించనున్న ఎన్‌హెచ్‌ఆర్‌సీ బృందం

‘దిశ’ ఘటనపై ఈ రోజు తెల్లవారు జామున నలుగురు నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేసిన విషయం తెలిసిందే. విచారణలో భాగంగా చర్లపల్లి జైలు నుంచి కస్టడీకి తీసుకున్న పోలీసులు ఘటన స్థలానికి తీసుకువచ్చి సీన్ రీకన్‌స్ట్రక్షన్‌ చేస్తుండగా, నిందితులు పోలీసులపై దాడికి పాల్పడేందుకు యత్నించి, రాళ్లు రువ్వుతూ పారిపోతుండటంతో, పోలీసులు ఆత్మరక్షణ కోసం నలుగురిని ఎన్ కౌంటర్ చేశారు. ఈ నేపథ్యంలో వారి మృతదేహాలను ఫోరెన్సి నిపుణుల ఆధ్వర్యంలో పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం మహబూబ్ నగర్ ఆస్పత్రికి తరలించారు.

కాగా, దిశ నిందితుల అంత్యక్రియలకు సంబంధించి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈనెల 9 వరకు నలుగురి మృతదేహాలను మహబూబ్‌నగర్ ఆస్పత్రిలో భద్రపరచాలని హైకోర్టు ఆదేశించింది. నిందితుల ఎన్‌కౌంటర్‌ను వ్యతిరేకిస్తూ కొన్ని మహిళా సంఘాలు హైకోర్టుకు లేఖ రాశాయి. హౌస్ మోషన్ పిటిషన్ దాఖలయ్యాయి. దీనిపై స్పందించిన హైకోర్టు ఈనెల 9 వరకు మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించవద్దని ఆదేశాలు జారీ చేసింది. కేసును 9వ తేదీన విచారణ జరపనున్నట్టు తెలుస్తోంది.

మరోవైపు ఈ నలుగురు నిందితులను నకిలీ హత్య చేశారని, ఆ పోలీసులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ ముంబైకి చెంది న్యాయవాది గురునాథ సదావర్తి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కు లేఖ రాశారు. జాతీయ మానవహక్కుల కమిషన్, తెలంగాణ హైకోర్టు, తెలంగాణ డీజీపీకు కూడా లేఖ రాశారు.

దిశ కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌ను జాతీయ మానవ హక్కుల కమిషన్‌(ఎన్‌హెచ్‌ఆర్‌సీ) సుమోటోగా స్వీకరించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఇప్పటికే తెలంగాణ పోలీసులకు నోటీసులు కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే శనివారం ఎన్‌హెచ్‌ఆర్‌సీ ప్రతినిధుల బృందం మహబూబ్‌నగర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి రానుంది. అక్కడ ఎన్‌కౌంటర్‌లోని మృతి చెందిన నిందితుల మృతదేహాలను పరిశీలించనున్నారు. ఒకవేళ ఎన్‌హెచ్‌ఆర్‌సీ ప్రతినిధులు కోరితే.. నిందితుల మృతదేహాలకు రీ పోస్టుమార్టమ్‌ నిర్వహించే అవకాశం ఉన్నట్టుగా పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటివరకు ముగ్గురి మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయింది. మరో నిందితుడు శివ మృతదేహానికి పోస్టుమార్టం కొనసాగుతోంది. కోర్టు ఆదేశాల మేరకు.. మహబూబ్‌నగర్‌ ప్రభుత్వాస్పత్రికి ఫ్రీజర్‌ బాక్సులను అధికారులు తరలించారు. ఈరోజు రాత్రికి ఆస్పత్రిలోనే దిశ నిందితుల మృతదేహాలను భద్రపరుస్తారు. ఇప్పటి వరకు మృతదేహాలను బంధువులకు అప్పగించలేదు. మహబూబ్‌నగర్‌ ప్రభుత్వ ఆస్పత్రి వద్ద భారీగా పోలీసు బందోబస్తు నిర్వహించారు.

Next Story