దిశ లాంటి దురదృష్టకర సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి?

తగినంతమంది పోలీసులు లేనందువల్ల..

మరి మన రాష్ట్రంలో పోలీసులు లేరా?

ఉన్నారు…

ఉండి ఏం చేస్తున్నారు?

ఇంకేం చేస్తారు? వీఐపీల సేవలో తరిస్తున్నారు. వారి టిఫిన్ బాక్సులు, ఫైళ్లు మోస్తున్నారు. అవసరమైతే వారికి వేసే దండలను, కప్పే శాలువలను, ఇచ్చే బొకేలను పట్టుకుంటున్నారు. వీఐపీకి నీళ్లు కావాలంటే నీళ్లు, పాలు కావాలంటే పాలు అందిస్తున్నారు. ఆరోగ్యం కోసం మందిస్తున్నారు.

అవునండీ. ఇదొక నమ్మలేని నిజం. మన రాష్ట్రంలో సాధారణ ప్రజానీకం విషయానికొస్తే ప్రతి 720 మందికి ఒక పోలీసు ఉంటే, ఒక్కో వీఐపీకి 14 మంది పోలీసుల రక్షణ కవచం ఉంది. ఇటీవలే బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ అనే పోలీసు పరిశోధక అధ్యయన సంస్థ ఇచ్చిన నివేదికలో ఈ నివ్వెర పరిచే గణాంకాలున్నాయి. తెలంగాణలో ఉన్న 300 మంది వీఐపీలకి మొత్తం 4000 మంది పోలీసులు రక్షణ కల్పిస్తున్నారు. ఇందులో 17 మంది ఎంపీలు, ఆరుగురు రాజ్య సభ ఎంపీలు, 120 ఎమ్మెల్యేలు, 40 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు.

అదే సామాన్యుల విషయానికి వస్తే దేశమంతటా సగటున 518 మందికి ఒక పోలీసు ఉంటే మన తెలంగాణలో మాత్రం 760 మందికి ఒక పోలీసు ఉన్నాడు. జాతీయ స్థాయిలో లక్ష జనాభాకి 193 మంది పోలీసులు ఉంటే తెలంగాణ రాష్ట్రంలో మాత్రం 131 మంది మాత్రమే ఉన్నారు. అంతే కాదు. తెలంగాణలో వాస్తవానికి 76407 మంది పోలీసు ఉద్యోగాలు ఉండాలి. కానీ ప్రస్తుతం ఉన్నది 46062 మాత్రమే. అంటే 35304 ఖాళీలున్నాయన్న మాట. ఉత్తరప్రదేశ్, బీహార్, బెంగాల్ ల తరువాత అతి తక్కువ పోలీసులు ఉన్న రాష్ట్రం తెలంగాణాయే. దేశమంతటా సగటున ఒక పోలీసు 1.27 చ.కి.మీ భూభాగానికి రక్షణ కల్పిస్తుంటే తెలంగాణలో మాత్రం 2.5 చ.కిమీ కి గస్తీ ఇస్తాడు. నిజానికి దేశంలోని అత్యుత్తమ పోలీసుల్లో తెలంగాణ పోలీసులు టాప్ లో ఉన్నారు. కానీ వీఐపీల సేవ, సిబ్బంది కొరతల వల్ల తమ విధులను సజావుగా నిర్వర్తించలేకపోతున్నారు.

ఇలాంటప్పుడు దిశ లాంటి దుర్ఘటనలు జరక్కపోతే ఇంకేం జరుగుతుంది?

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.