'దిశ' నిందితుల మృతదేహాల తరలింపు... కుటుంబీకులతో ఎన్‌హెచ్‌ఆర్సీ సమావేశం

By Newsmeter.Network
Published on : 8 Dec 2019 11:38 AM IST

దిశ నిందితుల మృతదేహాల తరలింపు... కుటుంబీకులతో ఎన్‌హెచ్‌ఆర్సీ సమావేశం

మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో మార్చురీలో భద్రపరిచి ఉంచిన దిశ అత్యాచారం, హత్య కేసు నిందితుల మృతదేహాలను పోలీసులు శనివారం అర్ధరాత్రి జిల్లా శివారులోని మయూరి పార్క్ దగ్గర ఉన్న ప్రభుత్వ వైద్యశాల నూతన భవనానికి తరలించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన వసతులు లేనందున మృతదేహాలను తరలించాల్సి వచ్చిందని పోలీసులు చెబుతున్నారు. ఇకపోతే ఢిల్లీ నుంచి వచ్చిన జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యులు శనివారం మహబూబ్‌నగర్ ఆసుపత్రిలో మృతదేహాలను పరిశీలించారు. అనంతరం శంషాబాద్‌ ప్రాంతంలో బాధితురాలి అత్యాచారం, హత్య జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. అలాగే ఎన్‌కౌంటర్‌ ప్రాంతం కూడా క్షుణ్ణుంగా పరిశీలించారు. కాలినడకన తిరుగుతూ అడుగడుగునా పరిశీలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను ఉన్నతాధికారులను అడిగి తెలుసకున్నారు. ఎన్‌కౌంటర్‌ సమయంలో ఎస్సై వెంకటేశ్వర్లు, కానిస్టేబుల్‌ అరవింద్‌ గౌడ్‌ లకు గాయాలు కాగా, వారు కేర్‌ ఆస్పత్రిలోచికిత్స పొందుతున్నారు. ఈ సందర్భంగా జాతీయ మానవ హక్కుల కమిషన్‌ సభ్యులు ఆస్పత్రికి సందర్శించి ఎస్సై, కానిస్టేబుళ్ల రికార్డును నమోదు చేశారు. వారిని పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు బృందం సభ్యులు.

Disha Case

ఇదిలా ఉండగా.. మార్చురీలో ఉన్న నలుగురి నిందితుల మృతదేహాలనువెంటనే వారి కుటుంబసభ్యులకు అప్పగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ జిల్లా పోలీసులు హైకోర్టును ఆశ్రయించగా.. ఈ నెల 9 వరకు మృతదేహాలను భద్రపరచాలని ఇప్పటికే కోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. పరిశీలనకు వచ్చిన ఎన్‌హెచ్‌ఆర్సీ సభ్యులు నిందితుల కుటుంబ సభ్యులతో సమావేశం కానున్నారు. దీంతో కుటుంబ సభ్యులను పోలీసులు ఈ రోజు తెల్లవారుజామున మృతుల కుటుంబ సభ్యులను హైదరాబాద్‌కు తరలించారు.

Next Story