ముఖ్యాంశాలు

  • దిశ హత్య కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌
  • ఎన్‌కౌంటర్‌ను తప్పుబడుతున్న మానవ హక్కుల సంఘాలు
  • నిందితులను పోలీసులు హత్య చేశారని ఆరోపణలు

హైదరాబాద్‌: దిశ హత్య ఘటన కేసు నిందితులను శుక్రవారం ఉదయం పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేశారు. సీన్‌ రీ కన్‌స్ట్రక్షన్‌ చేస్తుండగా నిందితులు పారిపోయేందుకు ప్రయత్నించారు. దీంతో నిందితులపై కాల్పులు జరిపామని పోలీసులు తెలిపారు. దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై ప్రజాసంఘాలు, మహిళలు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, సామాన్య ప్రజలు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నిందితులకు సరైన శిక్ష పడిందని, దిశకు సత్వర న్యాయం జరిగిందటున్నారు.

మరోవైపు నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేయడాన్ని మాత్రం పౌరహక్కుల సంఘాలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి. తెలంగాణ పోలీసుల తీరుపై మానవ హక్కుల సంఘాలు, ప్రగతిశీల మహిళ సంఘటన సభ్యులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. నిందితులను పోలీసులు కావాలనే చంపి.. ఎన్‌కౌంటర్‌ చేశామని చెప్తున్నారని పౌరహక్కుల సంఘం నేత కవిత శ్రీవాస్తవ ఆరోపించారు. క్రైమ్‌ సీన్‌ అనాలసిస్‌ కోసం నిందితులను తెల్లవారు జామునే తీసుకెళ్లాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. పోలీసులకు నిందితులను ఏడు రోజుల పాటు కస్టడీకి ఇచ్చిందన్నారు. నిందితుల చేతులకు కఫ్స్‌, ముఖాలకు మాస్క్‌లు ఉంటాయని కవిత శ్రీ వాస్తవ అన్నారు. ఇలాంటి సందర్భంలో నిందితులు పోలీసులపై రాళ్లు రువ్వి ఎలా పారిపోవడానికి ప్రయత్నించారో తెలపాలన్నారు. నిందితులకు దగ్గర ఆయుధాలు లేవు.. అలాంటప్పుడు నిందితులు పోలీసులపై ఎలా కాల్పులు జరుపుతారని శ్రీవాస్తవ ప్రశ్నించారు. మహమ్మద్ ఆరిఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చింతకుంట చెన్నకేశవులు పోలీసులు కాల్పుల్లో మరణించారు.

పక్కా ప్లాన్‌ ప్రకారమే నిందితులను పోలీసులు హత్య చేశారని మానవ హక్కుల సంఘం ఆరోపిస్తోంది. నిందితులను హత్య చేసిన పోలీసులపై కేసు నమోదు చేసి, ఎన్‌కౌంటర్‌పై న్యాయస్థానంలో విచారణ జరపాలన్నారు. నిందితులను హత్య చేసిన పోలీసులను, తెలంగాణ సీఎం, డీజీపీలను వెంటనే అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. మహిళలకు భద్రతను పెంచడం ద్వారా దిశ లాంటి ఘటనలు జరగకుండా ఉంటాయన్నారు. నిందితులను కోర్టు తీర్పు ద్వారా శిక్షించకుండా.. ఎన్‌కౌంటర్‌ చేయడం దారుణమని ప్రగతీశీ మహిళ సంఘటన్‌ నేతలు అంటున్నారు.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.