సెన్సార్ సభ్యుల టాక్ : 'డిస్కో రాజా' అభిమానులకు పండగే..!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 22 Jan 2020 6:57 AM GMTమాస్ మహారాజా రవితేజ బాక్సాఫీసు వద్ద సందడి చేసి చాలా కాలమే అయింది. రవితేజ నటించిన గత మూడు సినిమాలు కూడా దారుణ పరాభవాన్ని మిగిల్చాయి. ఇలా వరుస పరాజయాలతో డీలా పడ్డారు. వరుస డిజాస్టర్‌లు ఎదురవుతున్నా అవకాశాలు ఏ మాత్రం తగ్గలేదు.
అయితే, తన అభిమానులకు ఒక మంచి హిట్ ఇచ్చి మళ్లీ ఫామ్‌లోకి రావాలని రవితేజ చూస్తున్నారు. ఈ క్రమంలో మరోసార డిస్కో రాజా వంటి విభిన్న చిత్రాన్ని మాస్ మహారాజా ఎంపిక చేసుకున్నాడు. మూడు డిజాస్టర్ల తరువాత రవితేజ చేస్తున్న చిత్రం డిస్కో రాజా.
జనవరి 24న విడుదల కానున్న ఈ చిత్రానికి పెద్దగా పోటీ కూడా ఏం లేదు. సంక్రాంతి సినిమాల హడావుడి సర్దుమణగడంతో సినిమా బాగుంటే రవితేజకు బాక్సాఫీసు వద్ద ఎదురనేదే ఉండదు. మాస్ మహారాజా అభిమానులు ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్న హిట్ ఈ చిత్రం ద్వారా అందుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
రవితేజ కూడా ఈ చిత్రంపై ఫుల్ కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు. చాలా విభిన్న కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కిందని యూనిట్ సభ్యులు కాన్ఫిడెంట్‌గా చెబుతున్నారు. మరోపక్క రవితేజ కూడా తన సినీ కెరీర్‌లో తొలిసారి సైన్స్ ఫిక్షన్ జోనర్‌ను అటెంప్ చేశాడు. ఇప్పటి వరకు వచ్చిన ప్రోమోలు, పాటలు ఇలా ఏం చూసినా చాలా భిన్నంగా ఉన్నాయి.
అయితే, సినిమాపై పాజిటివ్ ఇంప్రెషన్ కలిగించడంలో సఫలమయ్యాయి. రవితేజ ఇందులో రెండు విభిన్నమైన షేడ్స్‌లో నటించబోతున్నట్టు వినికిడి. రవితేజకు ఇది బెస్ట్ కంబ్యాక్ ఫిల్మ్ అవుతుందని అంటున్నారు. నభా నటేష్, పాయల్ రాజ్‌పుత్, తాన్యాహోప్ ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటించారు.
సునీల్, సత్య వంటి వారి కామెడీ ఈ సినిమాకు బలం కానుందని తెలుస్తుంది. నేషనల్ అవార్డ్ విన్నింగ్ నటుడు బాబి సింహా ఈ సినిమాలో విలన్‌గా నటించాడు. డిస్కో రాజా తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికేట్‌ను జారీ చేసింది. ఇప్పటికే చిత్ర బృందం రెండు టీజర్‌లను విడుదల చేసింది.
ఈ సినిమాకు తమన్ సంగీతం సమకూర్చారు. ఆయన అందించిన పాటలకు ఇప్పటికే మంచి స్పందన వచ్చింది. ముఖ్యంగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన నువ్వు నాతో ఏమన్నావో.. నేనేం విన్నానో పాట విపరీతంగా ఆకట్టుకుంటుంది. మిగిలిన పాటలు కూడా బాగున్నాయి. నేపథ్య సంగీతం కూడా అద్దిరిపోతుందని చిత్ర యూనిట్ చెబుతోంది. రవితేజతో నేల టికెట్ వంటి డిజాస్టర్ నిర్మించిన రామ్ తాళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఏదేమైనా ఈ చిత్రాన్ని వీక్షించి యు/ఏ సర్టిఫికేట్ ఇచ్చిన సెన్సార్ సభ్యులు మాత్రం రవితేజ అభిమానులకు పండగేనంటూ పాజిటివ్ వైవ్‌ను వదిలారు.