వాట్సాప్ లో మెసేజీలు ఇక మాయం
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 5 Nov 2020 5:44 PM IST
వాట్సాప్ లో చాట్ చేసిన మెసేజీలు ఎల్లవేళలా ఉంటాయని అనుకుంటే మీ పొరపాటే.. కావాల్సిన సమయంలో డిలీట్ చేసుకోవచ్చు కదా అని అనుకోకండి. ఎందుకంటే వాట్సాప్ లో సరికొత్త ఫీచర్ వచ్చేసింది. ‘Disappearing Messages' అనే ఫీచర్ ను తీసుకుని వస్తున్నట్లు అధికారికంగా ధృవీకరించడం జరిగింది. గత నెలలో వాట్సాప్ బీటా వర్షన్ లో ఈ ఫీచర్ కనిపించింది.
బీటా వెర్షన్ లో ఈ ఫీచర్ ద్వారా ఎవరితో అయినా చేసిన చాటింగ్ ను, గ్రూప్ చాటింగ్ లో వచ్చిన మెసేజీలను వారం రోజులకల్లా డిలీట్ చేసే సదుపాయం ఉండేది. ఇప్పుడు తాజాగా అన్ని డివైజ్ లలో ఈ ఫీచర్ ను తీసుకుని వచ్చామని వాట్సప్ సంస్థ చెబుతోంది. ప్రస్తుతం ఆండ్రాయిడ్, ఐఓఎస్, లైనక్స్ బేస్డ్ మొబైల్స్ కే కాకుండా వాట్సాప్ డెస్క్ టాప్ వెర్షన్స్ కు, వాట్సాప్ వెబ్ కు కూడా ఈ నెల నెల లోపు అన్నిట్లోనూ తీసుకుని వస్తామని తెలిపింది.
‘Disappearing Messages' అనే ఫీచర్ ను ఆన్ చేసి పెట్టుకుంటే ఆ చాట్ ఏడు రోజుల తర్వాత కనిపించదట. దీని ద్వారా సంభాషణలు చాలా సున్నితంగానూ, ప్రైవేట్ గానూ ఉంటాయని అంటున్నారు. వన్-టు-వన్ చాట్ విషయంలో ‘Disappearing Messages' అనే ఫీచర్ ను ఆన్ లేదా ఆఫ్ చేసి పెట్టుకోవచ్చు. గ్రూప్స్ విషయంలో అడ్మిన్స్ కు ఆ సౌకర్యం ఉంటుంది. ప్రస్తుతం ఏడు రోజుల సమయం మాత్రమే ఇస్తూ ఉన్నామని.. అందువలన యాప్ ను వాడుతున్నవారికి మనశ్శాంతి లభించే అవకాశం కూడా ఉంటుందని అన్నారు.