హైద‌రాబాద్: స‌ంచ‌ల‌న సినీ ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ‌పై మ‌రో కేసు న‌మోదైంది. సీసీఎస్ సైబ‌ర్ క్రైమ్ పోలీస్ స్టేష‌న్ లో రాంగోపాల్ వ‌ర్మ‌పై ప్ర‌జాశాంతి పార్టీ అధ్య‌క్షుడు కె.ఏ పాల్ కోడ‌లు ఫిర్యాదు చేశారు. అమ్మ‌రాజ్యంలో క‌డ‌ప బిడ్డ‌లు సినిమా ప్ర‌మోష‌న్ కు త‌మ ఫొటోల‌ను రాంగోపాల్ వ‌ర్మ మార్పింగ్ చేసి వాడార‌ని బెగాల్ జ్యోతి త‌న ఫిర్యాదులో పేర్కొన్నారు. గ‌తంలో మాజి రాష్ట్ర‌ప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీతో తాము దిగిన ఫొటోల‌ను మార్పింగ్ చేసి సోష‌ల్ మీడియాలో పోస్టు చేశార‌ని బెగాల్ జ్యోతి ఆరోపించారు. రాంగోపాల్ వ‌ర్మ‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని బెగాల్ జ్యోతి పోలీసుల‌ను కోరింది. కాగా రాంగోపాల్ వ‌ర్మ‌పై ఐపీసీ 469 సెక్ష‌న్ కింద సైబ‌ర్ క్రైమ్ పోలీసులు కేసు న‌మోదు చేశారు. రాంగోపాల్ వ‌ర్మ ఫొటోలు మార్ఫింగ్ చేసిన ఐపీ నెంబ‌ర్ కోసం పోలీసులు గూగుల్ కు లెట‌ర్ రాశారు.

రాంగోపాల్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన‌ అమ్మ‌రాజ్యంలో క‌డ‌ప బిడ్డ‌లు సినిమాకు సెన్సార్ బోర్డు రివైజింగ్ క‌మిటీ లైన్ క్లియ‌ర్ చేసింది. ఈ సినిమాకు యూ/ఏ స‌ర్టిఫికెట్ ఇచ్చింది. సినిమాలోని కొన్ని స‌న్నివేశాల‌ను రివైజింగ్ క‌మిటీ తొల‌గించిన‌ట్టుగా తెలుస్తోంది. మొద‌ట‌ క‌మ్మ‌రాజ్యంలో క‌డ‌ప బిడ్డ‌లు టైటిల్ వివాదం చెలరేగింది. ఈ నేప‌థ్యంలో హైకోర్టు ఆదేశాల మేర‌కు రాంగోపాల్ వ‌ర్మ సినిమా టైటిల్ ను అమ్మ‌రాజ్యంలో క‌డ‌ప బిడ్డ‌లుగా మార్చారు. సినిమాని డిసెంబ‌ర్ 12న విడుద‌ల చేస్తున్నామ‌ని ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ ప్ర‌క‌టించారు. కాగా బెగాల్ జ్యోతి ఆర్జీవీపై పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో సినిమా విడుద‌ల‌పై అనుమానాలు నెల‌కొన్నాయి.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.