ఆ ఇద్దరిని నేనే ఇంట్రడ్యూస్ చేయాలి కానీ..? - రాఘవేంద్రరావు
By Newsmeter.Network Published on 12 Dec 2019 12:54 PM ISTదర్శకేంద్రుడు రాఘవేంద్రరావుకు.. హీరోలను ఎలా చూపించాలో బాగా తెలుసు. అలాగే హీరోయిన్స్ ని అందంగా ఎలా చూపించాలో ఇంకా బాగా తెలుసు. అందుకనే ఇండస్ట్రీలో సినీ ప్రముఖులు తమ వారసుల మొదటి చిత్రానికి రాఘవేంద్రరావును ఎంచుకున్నారు. విక్టరీ వెంకటేష్ ను రాఘవేంద్రరావే పరిచయం చేసారు కలియుగ పాండవులు సినిమా ద్వారా.
సూపర్ స్టార్ మహేష్ బాబును రాజకుమారుడు సినిమా ద్వారా రాఘవేంద్రరావే పరిచయం చేసారు. అలాగే స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ని కూడా రాఘవేంద్రరావే గంగ్రోతి సినిమా ద్వారా పరిచయం చేసారు. ఇక హీరోయిన్స్ ని అయితే.. చాలా మందిని పరిచయం చేసారు. వెంకీమామ వేడుకలో రాఘవేంద్రరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ వేడుకలో రాఘవేంద్రరావు పలు ఆసక్తికరమైన విషయాలను తెలియచేసారు.
ఇంతకీ ఆయన ఏం చెప్పారంటే.. రామానాయుడు వంద సినిమాలు చేసిన నిర్మాతగానే కాదు.. దేశంలోని అన్ని భాషల్లో సినిమాలు చేసిన నిర్మాత ఎవరైనా ఉన్నారా? అంటే ఆ ఘనత రామానాయుడుగారికే దక్కుతుంది. మా దర్శకులందరికీ దేవుడాయన. అలాగే నిర్మాతలకు గాడ్‌ఫాదర్. 24 శాఖలవారికి సాయం చేసే ఆపద్భాంవుడు. దగ్గుబాటి ఫ్యామిలీతో మా ఫ్యామిలీకి మంచి అనుబంధం ఉంది. రామానాయుడు గారు నాన్నగారితోనే కాదు.. నాతో కూడా ఎన్నో అద్భుతమైన సినిమాలు చేశారు.
అలాగే వెంకటేష్‌ను నా సినిమాతో పరిచయం చేయమని అన్నారు. వెంకటేష్ చక్కగా ట్రైనింగ్ తీసుకుని నటించారు. ఇక రానాను నేను ఇంట్రడ్యూస్ చేయాల్సింది. కానీ కుదరలేదు. అలాగే చైతన్యను కూడా ఇంట్రడ్యూస్ చేయాల్సింది. వీలుకాలేదు. తనతో తప్పకుండా సినిమా చేస్తాను అని చెప్పారు. మరి.. చైతన్యతో రాఘవేంద్రరావు తీసే సినిమా ఎప్పుడు ఉంటుందో..?