విజయ విద్యానేత్రి.. ధాత్రి..!
By మధుసూదనరావు రామదుర్గం Published on 7 Aug 2020 3:44 PM GMTస్పర్ధయా వర్ధతే విద్యా.. అంటారు. అంటే పోటీ ఉంటేనే చదువులో రాణిస్తారు అని అర్థం, పోటీ పడటమంటే.. కేవలం పరీక్షలకు వెళ్ళడం కాదు.. ఆ పరీక్ష నేపథ్యంలో ఓ సడలని దీక్ష ఉంటుంది. వదులుకోలేని పట్టుదల ఉంటుంది. అహోరాత్రుల శ్రమ కూడా ఉంటుంది. అన్నిటికీ మించి లక్ష్యం అందుకోవాలన్న జ్వలించే కాంక్ష ఉంటుంది. ఈ శుభలక్షణాలన్నీ పుణికి పుచ్చుకున్న తెలంగాణకు చెందిన యాదాద్రి భువనగిరి జిల్లా ముద్దుబిడ్డ ధాత్రి రెడ్డి 2019 సివిల్స్‌లో 46వ ర్యాంకర్‌గా నిలిచారు. ప్రస్తుతం నగరంలోని ఎల్.బి. నగర్‌లోనివాసముంటున్న ధాత్రిరెడ్డిని గెలుపుతీరాలకు తీసుకెళ్ళిన ఆ అనుభవ గాథ ఇలా..
రాత్రికి రాత్రే అద్భుతాలు జరగవు అన్నమాట ధాత్రిరెడ్డికి నూటికి నూరుపాళ్ళు వర్తిస్తుంది. 2018 సివిల్స్‌లో 233వ ర్యాంకు సాధించి ఐపీఎస్ శిక్షణ పూర్తిచేసుకున్న ధాత్రిరెడ్డి త్వరలోనే ఖమ్మం ట్రైనీ ఎసీపీగా రిపోర్టు చేయాల్సి ఉంది. ఐపీఎస్ అయినా ఐఏఎస్ అయినా తనకు తెలంగాణకు సేవలందించడమే ఇష్టమని ధాత్రిరెడ్డి అంటున్నారు.
యూపీఎస్సీ పరీక్షలంటేనే కఠినంగా ఉండటంతోపాటు పోటీపడేవారి సంఖ్య లక్షల్లో ఉంటుంది. ఎంపికలు వందల్లో ఉంటాయి. అంకితభావంతో అధ్యయనం చేస్తే తప్ప పరీక్షలో విజయం సాధించడం కష్టం. ధాత్రిరెడ్డి వైరల్ ఫీవర్ ఉన్నా.. పరీక్షలు క్లియర్ చేశారంటే తన మనోబలం ఎంతో మనకు అర్థమవుతుంది.
‘సివిల్ సర్వీస్‌లో చేరడమనేది నా చిన్ననాటి కల. అందులోనూ ఐపీఎస్ కావాలన్న కోరిక చాలా బలీయంగా ఉండేది. అనుకున్నట్టుగానే ఐపీఎస్ సాధించాను. ఇప్పుడు ఐఏఎస్‌లో డబుల్ డిజిట్ ర్యాంకు తెచ్చుకోవడం చాలా ఆనందంగా ఉంది.’ అంటూ తన విజయానందాన్ని పంచుకున్నారు.
అన్నింటా ఫస్టే..
ధాత్రిరెడ్డి ఇంటర్ వరకు హైదరాబాద్‌లోనే చదివారు. ఖరగ్‌పూర్ ఐఐటీలో డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత ముంబై, లండన్ లో ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్, డ్యూట్చి బ్యాంక్‌లో ఉద్యోగం చేశారు. అయితే ఎందుకో అలాంటి ఉద్యోగాలు ధాత్రిరెడ్డికి సంతృప్తి నివ్వలేదు. ఇలాగే సాగితే తన చిన్ననాటి కల నెరవేరదని అనుకున్నారు. మళ్ళీ మనసు సివిల్ సర్వీస్ వైపే లాగింది. ఢిల్లీలో ఐఏస్ కోచింగ్ తీసుకున్నా అది సరిపోదేమో అనిపించి హైదరాబాద్‌కు తిరిగి వచ్చేశారు. మళ్ళీ కోచింగ్ తీసుకోలేదు. ఇంటిపట్టునే ఉండి పట్టుదలతో చదివారు. ఇంటికి దగ్గరగా ఉన్న లైబ్రెరీకి వెళ్ళేవారు. పరీక్షకు సంబంధించి మెటీరియల్ తనే సొంతంగా తయారు చేసుకున్నారు.
ఐపీఎస్ శిక్షణలోనే ఐఏఎస్ ఇంటర్వ్యూకు తయారీ
నేషనల్ పోలీస్ అకాడెమీలో ఈ ఏడాది జులై 10న ఐపీఎస్ శిక్షణ పూర్తయింది. తెలంగాణ పోలీస్ అకాడెమీలో కూదా శిక్షణ పూర్తికానుంది. ఇంతలోనే 2019 సివిల్స్‌కు సిద్ధమై 46వ ర్యాంకు సాధించారు. ఎన్.పి.ఏ. శిక్షణ కాలంలోనే ఐఏఎస్ ఇంటర్వ్యూ కు తయారయ్యా అంటూ ధాత్రిరెడ్డి అంటున్నారు. కరెంట్ ఎఫైర్స్ కోసం దినపత్రికలు క్రమం తప్పకుండా చదివినట్లు వివరించారు. ఇంటర్వ్యూ లో వ్యక్తిత్వం, వ్యాపకాలు, ఆసక్తి తదితర అంశాలపై అడుగుతారని ప్రిపేర్ అయినట్లు చెప్పారు.
సామాజిక సేవపై మక్కువ
ధాత్రిరెడ్డి గారికి చిన్ననాటి నుంచే సామాజిక సేవలంటే చాలా ఇష్టం.అందుకే 2016లో ఫీడ్ ఇండియా పేరిట ఓ స్వచ్ఛంద సేవా సంస్థను ప్రారంభించారు. హోటళ్లు, క్యాంటీన్లలో ఆహారం మిగిలితే సేకరించి వృద్ధ, అనాథాశ్రమాల్లో పంచేవారు. ఈ ఆలోచనకు ప్రాతినిధ్యం వహిస్తూ క్లింటల్ గ్లోబల్ ఫౌండేషన్ నుంచి ఇండియా తరఫున పాల్గొనడానికి మియామి వెళ్ళారు. ఆ సమయంలోనే వ్యవస్థలో మార్పు రావాలంటే.. ఆ వ్యవస్థలోనే పనిచేయాలన్న సత్యం తెలుసుకోగలిగారు. ప్రభుత్వ ఉద్యోగంలో చేరడమే సరైన మార్గమని నిశ్చయించుకున్నారు.
తనూ ఓ బ్లాగర్..
వ్యక్తిత్వంలో బహుముఖ కోణం ఉన్న ధాత్రిగారు సివిల్ పరీక్షలకు తనే మెటీరియల్ తయారు చేసుకున్నారు. అహోరాత్రులు శ్రమించి ప్రాథమిక స్థాయి నుంచి తయారు చేసుకున్న నోట్స్, మెటీరియల్‌ను తన బ్లాగ్‌లో పొందుపరిచారు. మున్ముందు సివిల్ పరీక్షలు రాసే వారికి ఉపయోగపడాలని తన ఆకాంక్ష.
ఐఏఎస్.. ఐపీఎస్.. రెండూ ఇష్టమే..
సివిల్స్ పరీక్షల్లో అత్యున్నత ర్యాంకు సాధించిన ధాత్రి గారిని మీకు ఐఏఎస్, ఐపీఎస్ ఈ రెండింటిలో ఏది ఇష్టం అంటే తనకు రెండు ఇష్టమే అంటారు. తను లక్కీ అని ఎందుకంటే రెండింటిలో ఏదైనా ఎంచుకునే స్థానంలో ఉన్నానని, ఇది తనశ్రమకు విజ్ఞానానికి దక్కిన గౌరవమని అంటున్నారు. అయిత తెలంగాణలోనే తన సేవలు అందించాలని అనుకుంటున్నట్లు చెబుతున్నారు. ఐఏఎస్ క్యాడర్ ఏదో తేలాక దేన్ని ఎంచుకోవాలో నిర్ణయిస్తానని అన్నారు.