వాన్ పిక్ కేసులో ధర్మాన సంగతేమిటి.?

By Newsmeter.Network  Published on  5 Jan 2020 10:29 AM GMT
వాన్ పిక్ కేసులో ధర్మాన సంగతేమిటి.?

అమరావతి: అధికారంలోకి వచ్చినా వైసీపీ నేతలు కేసుల చిక్కుల ముడులు విప్పలేకపోతున్నారు. నిన్నటికి నిన్న ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి తనపై ఉన్న సీబీఐ కేసుల్లో తప్పక హాజరుకావలసిందేనని కోర్టు ఆదేశించింది. ఇప్పుడు తాజాగా మరో మంత్రి పై ఉన్న కేసు విచారణ ఏ స్థాయిలో ఉందని కోర్టు ప్రశ్నించింది. మాజీ రెవెన్యూ మంత్రి, వైసీపీ నేత ధర్మాన ప్రసాదరావుపై ఉన్న వాన్ పిక్ కేసు ఏ మేరకు వచ్చిందని సీబీఐ కోర్టు ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి బీవీ మధుసూదనరావు సీబీఐని ప్రశ్నించారు. దీనికి సంబంధించిన వివరాలను జనవరి 7 నాటికి సమర్పించమని కూడా ఆయన ఆదేశించారు.

వాన్ పిక్ భూములను పొందిన వారు జగన్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టారన్న ఆరోపణలపై కేసు నడుస్తోంది. వాన్ పిక్ అంటే వాడరేవు నిజాం పట్నం పోర్ట్ అండ్ ఇండస్ట్రియల్ కారిడార్ అని అర్థం. గుంటూరు ప్రకాశం జిల్లాల మధ్య 28,000 ఎకరాలలో దీనిని ఏర్పాటు చేయాలి. ఈ ప్రాజెక్టు కోసం వ్యాపార వేత్త నిమ్మగడ్డ ప్రసాద్ అనుసంధానకర్తగా వ్యవహరించారు. నిమ్మగడ్డ ప్రసాద్ ఈ కేసులో చీటింగ్ కు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఆయనను అరెస్టు చేశారు. ఆ తరువాత ఈ కేసులో సీబీఐ ధర్మాన ప్రసాదరావును నిందితునిగా చేర్చింది. అయితే 2013 లో ధర్మానపై కేసును కొనసాగించేందుకు రాష్ట్రప్రభుత్వ అనుమతిని కోరడం జరిగింది.

రాష్ట్ర ప్రభుత్వం దీనికి అనుమతిని నిరాకరించింది. దాంతో సీబీఐ ధర్మాన ప్రమేయం లేకుండానే కేసును కొనసాగించింది. తరువాత ధర్మాన రాజీనామా చేయడంతో సీబీఐ మరొక సారి ఆయనను ప్రాసిక్యూట్ చేసేందుకు అనుమతిని కోరింది. సీబీఐ ట్రయల్ కోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ ధర్మాన హైకోర్టును ఆశ్రయించారు. ఆ సందర్భంగా ధర్మాన వాదనను సమర్థిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది. హైకోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ సీబీఐ సుప్రీం కోర్టు ను ఆశ్రయించింది. న్యాయమూర్తి ఈ కేసు ప్రస్తుత స్థితి గురించి తెలుసుకునేందుకే తాజా ఆదేశాలు జారీ చేశారు.

Next Story