29న ధరణి పోర్టల్‌ ప్రారంభించనున్న కేసీఆర్‌

By సుభాష్
Published on : 24 Oct 2020 11:00 AM

29న ధరణి పోర్టల్‌ ప్రారంభించనున్న కేసీఆర్‌

తెలంగాణలో ధరణి పోర్టల్‌ ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఈనెల 29న మధ్యాహ్నం 12.30 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ధరణి పోర్టల్‌ను ప్రాంరభించనున్నారు. ముందుగా దసరా పండగ రోజు 25న ప్రారంభించాలని అనుకున్న సీఎం కేసీఆర్‌.. సాంకేతిక సమస్యలు, వరద సహాయక చర్యల్లో అధికారులు నిగమ్నం కావడం వల్ల 29కి వాయిదా వేశారు. ఆ రోజు నుంచి తహసీల్‌ కార్యాలయాల్లో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతానికి సాగుభూముల రిజిస్ట్రేషన్లు ప్రారంభించనున్న కేసీఆర్‌.. రాష్ట్ర వ్యాప్తంగా 570 మండలాల్లో దీనికి శ్రీకారం చుట్టనుంది.

కాగా, తెలంగాణ ప్రభుత్వం ధరణిపోర్టల్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. రాష్ట్ర భూ లావాదేవీలకు ప్రామాణికంగా, ఆధారంగా వేదికగా మార్చడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ధరణిని ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అయితే పోర్టల్‌ ప్రారంభం అయ్యేలోపు సంబంధిత ఉద్యోగుల నియామకం చేపట్టమని అధికారులకు సూచించారు సీఎం కేసీఆర్‌. ధరణి పోర్టల్‌లో భూమి రిజిస్ట్రేషన్‌, మ్యూటేషన్‌ తదితర కీలక అంశాలను అప్‌డేట్‌ చేస్తారు. ధరణి ప్రారంభమయ్యేంత వరకు రిజిస్ట్రేషన్లను ఆపాలని అప్పట్లో సీఎం కేసీఆర్‌ అధికారులకు సూచించారు.

Next Story