డాక్టర్‌.. యూట్యూబర్‌.. కొరియోగ్రాఫర్‌..!

By మధుసూదనరావు రామదుర్గం  Published on  12 Aug 2020 2:24 PM IST
డాక్టర్‌.. యూట్యూబర్‌.. కొరియోగ్రాఫర్‌..!

డాక్టర్‌ కావాలనుకున్నా.. కానీ యాక్టర్‌ అయ్యా! చాలా పాత డైలాగ్‌ ఇది. అయితే డాక్టర్‌ చదివి యాక్టర్లయినవారు ఉన్నారు. మన తెలుగులో రాజశేఖర్‌ యాక్టర్‌ కాకముందు డాక్టరేగా! అలాగే ధనశ్రీ కూడా! తనో డెంటల్‌ డాక్టర్‌.. అంతకన్నా అద్భుత కొరియోగ్రాఫర్‌. త్వరలో క్రికెటర్‌ చాహల్‌తో కలిసి ఏడడుగులు వేయబోతోంది. ఇంతకూ డాన్సర్‌ ధనశ్రీ అంతగా చాహల్‌ మనసు ఎలా దోచుకుంది? ఇంతకూ ఈ ధనశ్రీ ఎవరు? ఇవేగా మీ ప్రశ్నలు. కింద మేటర్‌లోకి వెళ్లండి మరి..

ముంబైకి చెందిన ధనశ్రీ వర్మ తో క్రికెటర్‌ చాహల్‌ వివాహం కుదిరింది. సోషల్‌ మీడియాలో రోకో కార్యక్రమాల ఫోటో షేర్‌ చేస్తూ నా జీవన సహచరి అంటూ పరిచయం చేశాడు. చాహల్‌ టీవీ ద్వారా సరదా వీడియోలతో అందరినీ ఆకట్టుకుంటున్న ఈ స్పిన్నర్‌ జీవితంలో అడుగిడబోతున్న ధనశ్రీ ఇప్పటికే మంచి యూట్యూబ్‌ స్టార్‌గా పేరు తెచ్చుకుంది. ధనశ్రీ వేవీముంబైలోని డీవై పాటిల్‌ డెంటల్‌ కాలేజీలో గ్రాడ్యుయేషన్‌ చేసింది. ఇది తన వృత్తి.

కొరియోగ్రఫర్‌గా.. హిప్‌ హాప్‌ డాన్సర్‌గా యూట్యూబ్‌ను బద్దలు కొడుతోంది. ఇది తన ప్రవృత్తి. డాక్టర్‌గా కన్నా డాన్సర్‌గా తను చాలా పాపులర్‌. బాలీవుడ్‌ పాటలకు తన శైలిలో డాన్స్‌లు చేస్తూ ఎందరినో ఆకట్టుకుంది. అందంతోపాటు అభినయం ఉన్న ధనశ్రీ ఎందరి మనసుల్లోనో చెదరని స్థానాన్ని సాధించుకుంది.

ప్రస్తుతం వెండితెరపై యాక్టర్ల కన్నా బుల్లితెర.. యూట్యూబర్లకు క్రేజీ ఎక్కువగా ఉంటోంది. యూత్‌ బ్యాచి అంతా సోషల్‌ మీడియాలోనే ఉంటున్నందున యూట్యూబ్‌లో యువస్టార్లు మెరిసిపోతున్నారు. చిన్నపిల్లలు కూడా అదేతోవలో పరగెడుతున్నారు. నిన్నటికి నిన్న మహేశ్‌బాబు బర్త్‌డే కానుకగా ఓ పిల్లల టీమ్‌ సరిలేరు నీకెవ్వరులో ఓ సీన్‌ను పర్‌ఫెక్ట్‌గా దించేశారు. ఎలాంటి గ్రాఫిక్స్‌ లేకున్నా.. బిగ్‌స్క్రీన్‌ కాకపోయినా.. చిన్నకెమెరాతో తీసిన ఈ సీన్‌కు లక్షలాది వ్యూస్‌ వచ్చిపడ్డాయి. బడా సినీ దర్శకులు దీనికి ప్రశంసల వర్షం కురిపించారు. అలాగే ధనశ్రీ కూడా యూట్యూబ్‌లో తనదంటూ ఓ శైలి.. తనకంటూ అభిమానులను సంపాదించుకునే పనిలో ఉన్నారు.

ధనశ్రీ చాలా తక్కువ కాలంలోనే యూట్యూబ్‌ స్టార్‌గా ఎదిగింది. తనకు ప్రస్తుతం లక్షలాది మంది అభిమాన ఫాలోయర్లున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌ అనుసరిస్తున్న వారి సంఖ్య తక్కువేం లేదు. ఏదో సరదాగా ప్రారంభించిన డాన్స్‌ ధనశ్రీని సెలిబ్రిటీ స్థాయికి తీసుకెళ్లడంతో...తను ధనశ్రీ వర్మ కంపెనీ ప్రారంభించారు. ఈ కంపెనీలో ఫిట్‌నెస్, డాన్స్, బాలీవుడ్‌ సాంగ్స్, వెడింగ్‌ కొరియోగ్రఫీల్లో తర్ఫీదునిస్తున్నారు. ఎన్నో వర్క్‌షాపులు నిర్వహించారు.. నిర్వహిస్తున్నారు కూడా!

సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నధనశ్రీ డాన్స్‌ వీడియోలు విపరీతంగా హల్‌చల్‌ చేస్తున్నాయి. బాలీవుడ్‌ హీరోలు రాజ్‌కుమార్‌ రావు, కార్తీక్‌ ఆర్యన్, సారా అలీఖాన్‌ తదితరులతో కలిసి డ్యాన్స్‌ చేసిన వీడియోలు చాలా పాపులర్‌ అయ్యాయి. ‘ఓ సాకీ సాకీ’ పాటకు మిలియన్ల కొద్ది వ్యూస్‌ వచ్చి వాలాయి. సుశాంత్‌ సింగ్‌ నటించిన చివరి చిత్రం దిల్‌బేచారాలో ఓ పాటకు కాలు కదిపారు కూడా.

దనశ్రీ ఈ ఏడాది టాలెంట్‌ రాక్‌ రైజింగ్‌ స్టార్‌ (మహిళల విభాగం) అవార్డు అందుకున్నారు. సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ధనశ్రీకి క్రికెటర్‌ యజువేంద్ర చాహల్‌తో చాలా కాలం నుంచి పరిచయం ఉంది. ఆ పరిచయం ప్రేమగా..పెళ్ళిగా మారుతోంది. ఇరు కుటుంబాల అంగీకారంతో ఇద్దరు త్వరలో పెళ్ళిపీటలు ఎక్కబోతున్నారు. బెస్టాఫ్‌ లక్‌ టు బోత్‌ ఆఫ్‌ యూ అందాం మరి!!

Next Story