ఏజెన్సీలో డీజీపీ ప‌ర్య‌ట‌న‌

By Medi Samrat  Published on  18 July 2020 2:45 PM GMT
ఏజెన్సీలో డీజీపీ ప‌ర్య‌ట‌న‌

తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి ములుగు జిల్లాలో పర్యటించారు. వరుస ఎన్‌కౌంట‌ర్ల‌‌ నేపథ్యంలో డీజీపీ మహేందర్ రెడ్డి ఏజెన్సీలోని వెంకటాపురం మండలంకు శ‌నివారం హెలికాప్టర్ ద్వారా చేరుకున్నారు. చత్తీస్‌గ‌డ్‌ నుంచి తెలంగాణ రాష్ట్రంలోకి మ‌వోయిస్టులు చొచ్చుకు వచ్చారనే సమాచారంతో గ్రేహౌండ్స్‌ బలగాలు అడవులను జల్లెడ పడుతున్నారు. ఈ నేఫ‌థ్యంలో డీజీపీ ఏజెన్సీలోని పోలీస్ అధికారులకు పలు సూచనలు చేయనున్నారు. ఇక డీజీపీ ప‌ర్య‌ట‌న నేఫ‌థ్యంలో అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

డీజీపీ మహేందర్ రెడ్డి పర్యటన నేపథ్యంలో వెంకటాపురం మండలంలోని హెలిప్యాడ్ ప్రాంతాన్ని ములుగు జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్, ములుగు ఏఎస్పీ సాయి చైతన్య, ఏటూర్ నాగారం ఏఎస్పీ శరత్ చంద్ర పవార్, ములుగు జిల్లా ఓఎస్డీ సురేష్ కుమార్ ప‌రిశీలించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గ్రేహౌండ్స్ బ‌ల‌గాలు అడువుల‌ను చుట్టిముట్టాయి.

ఇదిలావుంటే.. ములుగు జిల్లాలో పోలీసులు వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. డీజీపీ పర్యటన సందర్బంగా మావోయిస్టులు ఎక్కడ ఉన్నారో ఆచూకి చెప్పిన వారికి పోలీసులు న‌గ‌దు నజరాణా ప్రకటించించారు. ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల‌లో పోలీసులు ఈ ప్రయోగాస్త్రాన్ని సంధించారు.

సమాచారం ఇచ్చిన వ్యక్తికి రూ. 5లక్షల నుండి రూ.10లక్షలు వరకు బహుమ‌తి ఉంటుంద‌ని.. మావోయిస్టు నేతలు అజాద్, వెంకటేష్, భద్రు, సుధీర్, బిక్షపతి, మహేష్ ఇలా 18మంది ముఖ్య నేతలు ఫోటోలు.. పేర్లతో పలు గ్రామాలలో పోస్టర్లు ఏర్పాటు చేశారు. మావోల‌ సమాచారం తెలిసిన వారు 100కి డయల్ చేయండి. సమాచారం గోప్యంగా ఉంచుతామంటూ పోలీసులు హామీ ఇస్తు‌న్నారు.

ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్టర్లు, డాక్టర్లు, రాజకీయ నాయకులను బెదిరిస్తూ మావోలు అక్రమంగా డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారని అన్నారు. ఈ ప్రాంతంలో గిరిజనులను.. గిరిజనేతరులను.. ముఖ్యంగా యువతను మళ్లీ విప్లవం వైపు నడిపిస్తున్నారని.. డబ్బులు ఎరగా చూపి తెలంగాణలో మళ్లీ అడుగు పెడుతున్నారని అన్నారు. 30 సంవత్సరాల క్రితం తెలంగాణ రాష్ట్రంలో మావోయిస్టులు రక్త చరిత్ర సృష్టించిన విషయం అందరికి తెలిసిందే. గ‌త చ‌రిత్ర‌ను ఈ ప్రాంత ప్రజలు మరువలేదు.. అలాంటి రోజులు రాకుండా ప్రజలు సహకరించాల్సిన అవసరం ఉందని డీజీపీ అన్నారు.

తెలంగాణ ప్రజలకు భయపడిన మావోయిస్టులు కొంతకాలంగా సరిహద్దులోని చత్తీస్‌గ‌డ్‌ ప్రాంతంలో మకాం వేసి విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ.. ఈ ప్రాంతంపై దృష్టి సారిస్తున్నారని డీజీపీ అన్నారు. ముఖ్యంగా అభివృద్ధికి అడుగడుగునా అడ్డుప‌డుతూ.. వారి ఉనికిని చాటుకుంటూ.. గిరిజనులను పావుగా వాడుకుంటున్నారని అన్నారు. ప్ర‌జ‌లు ఎటువంటి భయాందోళనలకు గురి కాకూడదని.. మీకు ఎలాంటి ఇబ్బందులు కలిగినా పోలీసులకు సమాచారం అందివ్వాలని.. సమాచారం ఇచ్చిన వారి వివ‌రాలు గోప్యంగా ఉంచుతామని డీజీపీ అన్నారు.

Next Story