కనిపిస్తే క్వారంటైన్ కు పంపిస్తాం

By అంజి  Published on  23 March 2020 2:19 PM GMT
కనిపిస్తే క్వారంటైన్ కు పంపిస్తాం

ముఖ్యాంశాలు

  • బయటికొచ్చారో..భారీ జరిమానాలు
  • ఎక్కవసార్లు రోడ్లపై కనిపిస్తే వాహనాలు సీజ్
  • తెలుగు రాష్ట్రాల్లో నిబంధనలు మరింత కఠినం

కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా ముమ్మరంగా వ్యాప్తి చెందుతోంది. ఈ తరుణంలో తెలుగు రాష్ట్రాలు నిబంధనలను మరింత కఠినతరం చేశారు. తెలుగు రాష్ట్రాలు లాక్ డౌన్ చేస్తున్నట్లు ఇద్దరు సీఎం లు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పినా ప్రజల తీరులో మార్పు కనిపించలేదు. గుంపులు గుంపులుగా తిరగొద్దని విజ్ఞప్తి చేసినా..తమని కాదన్నట్లే ప్రవర్తించారు. పోలీసులు మైకులు పట్టుకుని రోడ్లపైకి రావొద్దని చెప్పినా పరిస్థితి ఏ మాత్రం అదుపులోకి రాలేదు.

దీంతో విసిగిపోయిన పోలీసులు లాభం లేదనుకుని రంగంలోకి దిగారు. తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి ఆదేశాలతో అనవసరంగా రోడ్లపైకి వచ్చిన వారిపై క్రిమినల్ కేసులు పెట్టేందుకు సిద్ధమయ్యారు పోలీసులు. లేదా రోడ్లపై కనిపించిన వారికి క్వారంటైన్ సెంటర్లకు పంపిస్తామని హెచ్చరించారు. సాయంత్రం గంటల తర్వాత రోడ్లపై కనిపించిన వాహనదారులను తిప్పివెనక్కి పంపించేస్తున్నారు. కాదని వాదించిన వారికి భారీ జరిమానాలు విధిస్తున్నారు.

ఇక ఏపీ విషయానికొస్తే కరోనా వైరస్ కట్టడి లో భాగంగా రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ ప్రజల శ్రేయస్సు కోసం 13 సూచనలు చేశారు. తప్పనిసరిగా ప్రజలు ఈ సూచనలను పాటించాలని విజ్ఞప్తి చేశారు.

1. కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉన్నందున ప్రజలంతా ఇళ్లకే పరిమితమవ్వాలి. అందరూ సెల్ఫ్ క్వారంటైన్ లో ఉంటేనే కరోనాను కట్టడి చేయగలం.

2.ప్రజల ఆరోగ్యార్థం మార్చి 23 నుంచి 31 వరకూ రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ అమలులో ఉంటుందన్నారు.

3.ప్రైవేట్ వాహనాలను ఎమర్జెన్సీ పనులకే ఉపయోగించాలని సూచించారు.

4. రానున్న వారం, 10 రోజులు మరింత కీలకమని తెలిపారు.

5. కరోనా బారి నుంచి మనల్ని మనం రక్షించుకోవాలంటే ఇళ్లకే పరిమితమవ్వడం మంచిదన్నారు.

6. ఎవరికైనా కరోనా లక్షణాలుంటే వెంటనే వైద్య సిబ్బందిని సంప్రదించాలి.

7. లాక్ డౌన్ సమయంలో ప్రజలంతా పోలీసులకు సహకరించాలి. కాదని యథేచ్ఛగా తిరిగితే కఠిన చర్యలు తప్పవు.

8. భావి భారత మెరుగైన సమాజం కోసం పోలీసుల ఆంక్షలను ప్రజలు తప్పక పాటించి తీరాలి.

9. ఏ మాత్రం అజాగ్రత్త వహించినా..దానికి మూల్యంగా ప్రాణాలు పోగొట్టుకోవాల్సి ఉంటుంది.

10. ప్రతి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో చెక్ పోస్టులు ఏర్పాటు. ఎక్కవసార్లు రోడ్లపై కనిపిస్తే వాహనం సీజ్. సీజ్ చేసిన వాహనాలు వైరస్ తగ్గుముఖం పట్టాకే తిరిగిస్తారు.

11. ప్రైవేట్ వాహనాలను నిత్యావసర వస్తువులు/అత్యవసర సేవలకు మాత్రమే అనుమతిస్తారు.

12. ప్రభుత్వ అధికారులు, చట్టాన్ని చాలా కఠినంగా అమలు చేస్తారు.

13. పొరుగు రాష్ట్రాల నుంచి ఒక్క వాహనం కూడా రాష్ట్రం లోపలికి వచ్చేందుకు వీల్లేదు.

Next Story
Share it