మంగళవారం పంచముఖ హనుమంతుడిని పూజిస్తే.. కుజ దోష నివారణతో పాటు విశేష ఫలితాలు
రామరావణ యుద్ధంలో మైరావణుడు రామలక్ష్మణులను అపహరించి పాతాళంలో బంధిస్తాడు. అతడిని అంతం చేయాలంటే 5 దీపాలు ఒకేసారి ఆర్పాలి.
By - అంజి |
మంగళవారం పంచముఖ హనుమంతుడిని పూజిస్తే.. కుజ దోష నివారణతో పాటు విశేష ఫలితాలు
రామరావణ యుద్ధంలో మైరావణుడు రామలక్ష్మణులను అపహరించి పాతాళంలో బంధిస్తాడు. అతడిని అంతం చేయాలంటే 5 దీపాలు ఒకేసారి ఆర్పాలి. అందుకే హనుమాన్ పంచముఖ రూపం ధరించి, ఆ దీపాలను ఆర్పి మైరావణుడిని వధించాడు. దుష్ట శిక్షణ కోసం ఉద్భవించిన ఈ మహోగ్ర రూపం భక్తులకు సర్వ శుభాలను చేకూరుస్తుందని నమ్మకం. పంచముఖ హనుమత్ స్తోత్రం, పూజా విధానం, ఆయనను పూజిస్తే దోషాలు తొలగిపోవడం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
పంచముఖ హనుమంతుడు 5 విశిష్ఠ శక్తుల సమ్మేళనం. ఆయన స్తోత్రాన్ని పఠిస్తే భయం, శుత్రుపీడ, గ్రహ దోషాలు తొలగిపోతాయని నమ్మకం. 5 ముఖాలు 5 రకాల అనుగ్రహాలను ఇస్తాయి. వానర ముఖం కోరికలను తీర్చగా, నరసింహ రూపం విజయాన్ని, గరుడ రూపం విష భయాల నుంచి రక్షణను, వరాహ ముఖం ఐశ్వర్యాన్ని, హయగ్రీవ రూపం జ్ఞానాన్ని ప్రసాదిస్తాయి. మానసిక ప్రశాంతత కోసం, సంకల్ప బలం పెరగడం కోసం నిత్యం ఈ స్తోత్రాన్ని పఠించాలి.
పంచముఖ హనుమంతుడి స్తోత్రాలివే
- విభీషణ సుతో నిలః సతతం సాధుపూజితః
పంచవక్త్ర హనుమంత ముపాసే త్సమృద్ధిభాక్
- వందే వాన నారసింహ ఖరగాట్ క్రోడాశ్వ వక్రాంచితం
నానాలంకరణం త్రిపంచనయనం దేదీప్యమానం రుచా
హస్తాబ్జె రసి ఖేట పుస్తక సుధాకుంభాం కుశా ద్రిం గదాం
ఖట్వాంగం ఫణి భూరుహం దశభుజం సర్వారి గర్వాపహం
మంగళవారం నాడు పంచముఖ హనుమంతుడిని పూజిస్తే
మంగళవారం నాడు పంచముఖ హనుమంతుడిని పూజించడం వల్ల విశేష ఫలితాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు. జాతకంలోని కుజ దోష నివారణకు, రుణ బాధల నుంచి విముక్తి కోసం ఈ పూజ చేయాలంటున్నారు. '5 ముఖాల స్వామిని ఆరాధించడం వల్ల 5 దిశల నుంచి రక్షణ లభిస్తుంది. వ్యాధుల నుంచి విముక్తి, శత్రువులపై విజయం సాధిస్తారు. ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. విద్యార్థులకు ఏకాగ్రత, జ్ఞానం లభిస్తాయి' అంటున్నారు. 4
పూజించే విధానం
పంచముఖ హనుమంతుని పూజా విధానం చాలా శక్తివంతమైనది. మంగళవారం లేదా శనివారం చేయాలి. ఉదయాన్నే స్నానం ఆచరించి, పూజా గదిని శుభ్రం చేసుకోవాలి. స్వామి వారి పటాన్ని సింధూరంతో అలంకరించాలి. 5 ముఖాలకు ప్రతీకగా 5 వత్తుల దీపం వెలిగించాలి. 5 రకాల నైవేద్యాలు అరటి, బెల్లం, శనగలు వంటివి సమర్పించాలి.