నవ గ్రహాల చుట్టూ ప్రదక్షిణ ఎందుకు చేయాలి?
హనుమ, శివాలయాలకు వెళ్లినప్పుడు నవ గ్రహాలకు ప్రదక్షిణ చేస్తే విశేష ఫలితాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు.
By - అంజి |
నవ గ్రహాల చుట్టూ ప్రదక్షిణ ఎందుకు చేయాలి?
హనుమ, శివాలయాలకు వెళ్లినప్పుడు నవ గ్రహాలకు ప్రదక్షిణ చేస్తే విశేష ఫలితాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు. 'శివుడు లయకారుడు. హనుమంతుడు గ్రహాలను నియంత్రించే శక్తిమంతుడు. వీరి సన్నిధిలో ప్రదక్షిణలు చేస్తే జాతకంలోని దోషాలు తొలగి, జనాకర్షణ, ధనాకర్షణ కలుగుతాయి. అపమృత్యు భయాలు తొలగి సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుంది' అంటున్నారు.
నవగ్రహ ప్రదక్షిణ ఎలా చేయాలి?
సూర్యుడిని దర్శించుకుంటూ వెళ్లాలి. ఆ తర్వాత ఎడమ వైపు నుంచి కుడివైపునకు 9 ప్రదక్షిణలు చేయాలి. ఇవి పూర్తయ్యాక తిరిగి కుడివైపు నుంచి ఎడమవైపునకు రాహువు, కేతువులను స్మరిస్తూ మరో రెండు ప్రదక్షిణలు చేయాలి. చివరగా ఒక్కొక్క గ్రహం పేరు తలుచుకుంటూ ఒక ప్రదక్షిణ పూర్తి చేయాలి. ఇలా శాస్త్రోక్తంగా నియమాలను పాటిస్తూ ప్రదక్షిణలు చేయడం వల్ల జాతక దోషాలు తొలగి అశేషమైన ఫలితాలు లభిస్తాయని జ్యోతిష నిపుణులు చెబుతున్నారు.
తప్పక పాటించాల్సిన నియమాలు
నవ గ్రహ ప్రదక్షిణలో విగ్రహాలను అస్సలు తాకకూడదని పండితులు చెబుతున్నారు. ప్రదక్షిణ పూర్తయ్యాక వాటికి వీపు చూపకుండా గౌరవంగా వెనుకకు రావాలని అంటున్నారు. ఎప్పుడు పడితే అప్పుడు నవ గ్రహాలకు ప్రదక్షిణ చేయడం మంచిది కాదని, శుచిగా స్నానం చేసి పరిశుభ్రమైన దుస్తులు ధరించినప్పుడే నియమబద్ధంగా ప్రదక్షిణలు చేయాలని అంటున్నారు. సంపూర్ణ అనుగ్రహం కోసం ఈ నియమాలు కచ్చితంగా పాటించాలని సూచిస్తున్నారు.
పఠించాల్సిన మంత్రం
'ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయచ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమ.'
నవగ్రహ ప్రదక్షిణ చేసేటప్పుడు ఈ మంత్రాన్ని పఠిస్తే.. మనసు ఏకాగ్రతతో నిండి, గ్రహాల అనుగ్రహం వేగంగా లభిస్తుంది. సూర్యుడు మొదలుకొని కేతువు వరకు తొమ్మిది గ్రహాలను స్మరిస్తూ చేసే ఈ ప్రార్థన జాతక దోషాలను హరిస్తుంది. .మానసిక ప్రశాంతతను చేకూరుస్తుంది. అలాగే గ్రహ గతులు అనుకూలించి ఆయురారోగ్య ఐశ్యరాలు లభిస్తాయని శాస్త్రం చెబుతోంది.
శివాలయాలు, హనుమాన్ దేవాలయాలకు వెళ్లినప్పుడు ముందుగా ఆ ఆలయంలోని ప్రధాన దైవాన్ని దర్శించుకోవాలి. ఆ తర్వాతే నవగ్రహ ప్రదక్షిణలు చేయాలి. శాస్త్రాల ప్రకారం.. మూలవిరాట్టును దర్శించి బయటకు వచ్చాక నవగ్రహ మండపం వద్దకు వెళ్లి పద్ధతి ప్రకారం ప్రదక్షిణలు చేయాలి. ప్రదక్షిణలు పూర్తయ్యాక మరోసారి ప్రధాన దైవాన్ని దర్శించుకుని, ఆపై ఇంటికి వెళ్లడం వల్ల సంపూర్ణ ఫలితం లభిస్తుందని పండితులు చెబుతున్నారు.