వసంత పంచమి.. ఏ వయస్సులో అక్షరాభ్యాసం చేయించాలి, ఇంట్లో చేయించవచ్చా?
జ్ఞానానికి అధిదేవత అయిన సరస్వతీ దేవీ మాఘ శుక్ల పంచమి నాడు జన్మించినట్టు పురాణాల వాక్కు. ఆ రోజునే వసంత పంచమిగా జరుపుకొంటాం.
By - అంజి |
వసంత పంచమి.. ఏ వయస్సులో అక్షరాభ్యాసం చేయించాలి, ఇంట్లో చేయించవచ్చా?
జ్ఞానానికి అధిదేవత అయిన సరస్వతీ దేవీ మాఘ శుక్ల పంచమి నాడు జన్మించినట్టు పురాణాల వాక్కు. ఆ రోజునే వసంత పంచమిగా జరుపుకొంటాం. బ్రహ్మదేవుడు సృష్టిలో భాగం లోకానికి వాక్కును, చైతన్యాన్ని ప్రసాదించడానికి అమ్మవారిని ఆవిర్భవించారు. అందుకే ఈ రోజును శ్రీపంచమి, వాగీశ్వరి జయంతిగా కూడా పిలుస్తారు. వసంత కాలం ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది.
శుభ ముహూర్తం?
2026లో వసంత పంచమి జనవరి 23, శుక్రవారం వచ్చింది. పంచమి తిథి ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున 2.28 గంటలకే ప్రారంభమవుతుంది. పూజకు, పిల్లలకు అక్షరాభ్యాసం చేయించడానికి ఉదయం 7.15 గంటల నుంచి మధ్యాహ్నం 12.33 గంటల వరకు అత్యంత శుభప్రదమైన సమయం. సూర్యోదయ తిథి ప్రాధాన్యత కలిగిన ఈ సమయంలో విద్యాభ్యాసం ప్రారంభిస్తే చదువుల తల్లి దీవెనలతో పిల్లలు ఉన్నత విద్యావంతులుగా తయారవుతారని పండితులు సూచిస్తున్నారు.
అక్షరాభాస్యం ఇంట్లో చేయించవచ్చా?
వసంత పంచమి నాడు గుడికి వెళ్లలేకపోతే ఇంట్లోనూ అక్షరాభ్యాసం చేయవచ్చు. పురోహితులను పిలిపించి శాస్త్రోక్తంగా చేయించవచ్చు. మీకు మంత్రాలు, విధివిధానాలు తెలిస్తే తల్లిదండ్రులు కూడా పిల్లలకు అక్షర దీక్ష ఇవ్వవచ్చు. సరస్వతీ దేవి చిత్రపటం ముందు బియ్యం పోసి, ఓంకారంతో అక్షరాభ్యాసం చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. భక్తి, నమ్మకంతో ఇంట్లో నిర్వహించే ఈ పవిత్ర కార్యం పిల్లల విద్యాభ్యాసానికి చక్కని పునాది అవుతుంది.
ఏ వయస్సులో అక్షరాభ్యాసం చేయించాలి?
పిల్లలకు 3 సంవత్సరాల వయస్సులో అక్షరాభ్యాసం చేయించడం అత్యంత శ్రేయస్కరమని పండితులు సూచిస్తున్నారు. ఈ పవిత్ర కార్యానికి వసంత పంచమి వంటి తిథులు అత్యంత శుభప్రదమైనవని సూచిస్తున్నారు. అయితే దేవాలయంలో అక్షరాభ్యాసం చేయించడానికి నక్షత్రం, తిథి బాగోలేదని సంకోచించాల్సిన పని లేదని అంటున్నారు. జ్ఞానప్రదాన అమ్మవారి సన్నిధిలో ఏ రోజైనా అక్షర దీక్ష తీసుకోవచ్చని చెబుతున్నారు.
వసంతపంచమి రోజు అక్షరాభ్యాసం చేయడం కుదరకపోతే?
ఆశ్వయుజ మాసంలో వచ్చే శరన్నవరాత్రులలో 'మూల నక్షత్రం' రోజున లేదా విజయదశమి పర్వదినాన పిల్లలకు అక్షర దీక్ష చేయించవచ్చు. అది వీలుపడకపోతే ఉత్తరాయణ పుణ్యకాలంలో మంచి తిథి, ముహూర్తం చూసుకుని ఈ కార్యక్రమం నిర్వహించుకోవచ్చు. అది కూడా సాధ్యం కాకపోతే కనీసం దక్షిణాయనంలోనైనా మంచి ముహూర్తం ఉన్న రోజును ఎంచుకుని అక్షరాభ్యాసం చేయించవచ్చు.