పరవ పవిత్రమైన వైకుంఠ ఏకాదశి రోజు బియ్యంతో చేసిన పదార్థాలు తీసుకోకూడదు. ఉపవాసం ఆచరించి, పాలు, పండ్లు, నీరు మాత్రమే తీసుకోవాలి. మాంసాహారం, మద్యపానాన్ని ముట్టరాదు. శారీరక సంబంధాలకు దూరంగా ఉంటూ బ్రహ్మచర్యం పాటించాలి. పగలు నిద్ర పోరాదు. రాత్రి జాగరణ చేస్తూ విష్ణు నామస్మరణ చేయాలి. తులసి అంటే విష్ణువుకు మహాప్రీతి. ఇవాళ తులసి ఆకులను కోయొద్దు. ఇదరులను బాధపెట్టేలా విమర్శలు, కఠిన మాటలు మాట్లాడొద్దు.
ఏకాదశి పేరెలా వచ్చిందంటే?
ముర అనే రాక్షసుడితో పీడింపబడే దేవతలంతా మహా విష్ణువును ప్రార్థిస్తారు. దీంతో మురతో యుద్ధం చేస్తూ ఆయన సింహవతి అనే గుహలోకి ప్రవేశిస్తాడు. స్వామి శక్తి నుంచి ఏకాదశి అనే స్త్రీ ఉద్భవించి మురను సంహరిస్తుంది. విష్ణువు సంతోషించి వరం కోరుకోవాలని అడగగా, ఇవాళ ఉపవాసం ఉన్న వారికి మోక్షం కలిగించమని ఆమె కోరుతుంది. స్వామి తథాస్తు అనడంతో పాటు వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని చెప్పాడు. అలా వైకుంఠ ఏకాదశి అయింది.
వైకుంఠ ఏకాదశి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రాల్లో ఉత్తర ద్వారాలు తెరుచుకున్నాయి. తిరుపతి, యాదాద్రి, భద్రాద్రి ఆలయాలతో పాటు వివిధ నగరాలు, పట్టణాల్లో వైష్ణవ క్షేత్రాలు కిటకిటలాడుతున్నాయి. స్వామి వారిని దర్శించుకునేందుకు వేకువ జాము నుంచే భక్తులు ఆలయాల వద్ద క్యూ కట్టారు.