నేడు రథ సప్తమి: అరుణోదయ స్నానం ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి.. ఒకవేళ జిల్లేడు ఆకులు దొరకకపోతే?
సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. తూర్పు ముఖంగా నదిలో నిలబడి తలపై ఒకటి, భుజాలు, మోచేతులు, మోకాళ్లపై రెండు చొప్పున...
By - అంజి |
నేడు రథ సప్తమి: అరుణోదయ స్నానం ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి.. ఒకవేళ జిల్లేడు ఆకులు దొరకకపోతే?
సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. తూర్పు ముఖంగా నదిలో నిలబడి తలపై ఒకటి, భుజాలు, మోచేతులు, మోకాళ్లపై రెండు చొప్పున 7 జిల్లేడు ఆకులను, వాటిపై రేగుపళ్లను ఉంచి స్నానం చేయాలి. అలాగే సూర్య మంత్రాలు పఠించాలి. నెత్తిన రేగుపళ్లు పోసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. స్నానాంతరం సూర్యుడికి అర్ఘ్యం సమర్పించాలి. తద్వారా ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని, గత జన్మ పాపాలు నశిస్తాయని నమ్మకం
ఏ ఘడియలో స్నానం చేయాలంటే?
2026లో మాఘ శుక్ల సప్తమి తిథి జనవరి 25న ఉదయం 12.39 మొదలై.. అదే రోజు రాత్రి 11.10కి ముగిస్తుంది. సూర్యోదయ తిథిని అనుసరించి జనవరి 25, ఆదివారం రోజున రథసప్తమి పర్వదినాన్ని జరుపుకోవాలి. ఈ పవిత్రమైన రోజున అరుణోదయ స్నానం ఆచరించడానికి ఉయదం 5.26 నుంచి 7.13 గంటల వరకు అత్యంత శుభ సమయమని పండితులు చెబుతున్నారు. ఈ నిర్ణీత సమయంలో స్నానం చేసి సూర్య భగవానుడిని ఆరాధించడం వల్ల అనారోగ్యాలు తొలగి ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని వారు సూచిస్తున్నారు.
అరుణోదయ స్నానం ఆచరిస్తూ పఠించాల్సిన మంత్రం ఇదే
'యదా జన్మకృతం పాపం మయాజన్మసు జనమసు, తన్మీరోగంచ శోకంచ మాకరీ హంతు సప్తమీ. ఏతజ్ఞన్మకృతం పాపం యచ్చ జనమంతార్జితం, మనోవాక్కాయజం యచ్చ జ్ఞాతాజ్ఞాతేచ యే పునః సప్తవిధం పాపం స్నానామ్నే సప్త సప్తికే సప్తవ్యాధి సమాయుక్తం హరమాకరి సప్తమి'.. తెలిసీ, తెలియక చేసిన పాపాలు, తప్పుల వల్ల వచ్చిన రోగాలు, శోకాలన్నీ ఈ సప్తమి స్నానంతో నశించుగాక.. అని దీనర్థం.
అరుణోదయ స్నానానికి జిల్లేడు ఆకులు దొరకకపోతే..
రథసప్తమి పర్వదినాన ఆచరించే అరుణోదయ స్నానానికి జిల్లేడు ఆకులు తప్పనిసరి. అవి దొరకకపోతే వాటికి బదులుగా చిక్కుడు లేదా రేగు ఆకులు వాడొచ్చని పండితులు చెబుతున్నారు. చిక్కుడు ఆకులు, కాయలతో రథాన్ని రూపొందించి, తమలపాకుపై రక్తచందనంతో సూర్య బింబాన్ని తీర్చిదిద్ది ఆవాహన చేస్తే మంచి జరుగుతుందని అంటున్నారు. ఈ రోజున స్త్రీలు నోములు నోచుకోవడం, ఆధ్యాత్మిక సాధనలు చేయడం వల్ల విశేష ఫలితాలు లభిస్తాయని నమ్మకం.