పురాణేతిహాసాలెన్ని ఉన్నా.. అవేవీ చదవకపోయినా ఒక్క భగవద్గీత చదివితే చాలాంటారు. అంతటి జ్ఞానాన్ని ప్రసాదించే పవిత్ర గ్రంధం ఆవిర్భవించింది ఈ రోజే. అందుకే నేడు గీతా జయంతి జరుపుకుంటాం. ఫలాన్ని ఆశించక కర్తవ్యాన్ని నిర్వర్తించు అనే సిద్ధాంతాన్ని గీతో బోధిస్తుంది. మనల్ని కర్తవ్యం వైపు నడిపిస్తుంది. జీవితంలో గీతా సారాన్ని ఆచరిస్తే పరాజయం ఉండదనడానికి మహా భారతమే నిదర్శనం. వ్యాసుడు రచించిన మహా భారతంలో ఓ భాగమే భగవద్గీత అనే విషయం చాలా మందికి తెలిసే ఉంటుంది.
భారత ఇతిహాసంలో భీష్మ పర్వం 25వ అధ్యాయం మొదలు 42వ అధ్యాయవం వరకు మొత్తం 18 అధ్యాయాలను భగవద్గీత చెబుతారు. ఇందులో మొత్తం 700 శ్లోకాలు ఉంటాయి. ఇవి మనం ధర్మ బద్ధంగా ఎలా జీవించాలో నేర్పుతాయి. బంధువులను చంపడానికి విముఖత చూపిన అర్జునుడిని ధర్మ మార్గాన్ని చూపడానికి, ధర్మాన్ని గెలిపించడానికి కృష్ణుడు గీతబోధ చేశాడు.
పురాణాల్లో దేవుడు కొందరికి ఎన్నో గొప్ప వరాలిచ్చాడని, తమకేం ఇవ్వలేదని కొందరు బాధపడుతుంటారు. కానీ సమస్త మానవాళికి ఆయన ఓ గొప్ప వరాన్ని అందించాడు. అదే మనకు జ్ఞాన మార్గాన్ని చూపించే భగవద్గీత. మనిషి మనిషిగా జీవించేందుకు, ధర్మ బద్ధంగా ముందుకు వెళ్లేందుకు ఇంతకంటే గొప్ప బహుమానం, వరం ఇంకేమైనా ఉంటుందా? అందుకే గీతా పారాయణం చేయాలంటారు పెద్దలు.