'దైవ రూపాలు మన జీవనశైలికి దిశానిర్దేశాలు' అనేందుకు విష్ణుమూర్తి పవళించే విధానమే నిదర్శనం. ఆయన ఎడమ వైపునకు ఒరిగి ఉండే ఈ స్థితిని వామకుక్షి అంటారు. ఈ భంగిమలో శరీరం విశ్రాంతి తీసుకున్నా, మెదడు చురుగ్గా పని చేస్తుంది. భోజనం చేసిన కొద్దిసేపటి తర్వాత ఇలా నిద్రిస్తే జీర్ణక్రియ, రక్తప్రసరణ మెరుగవ్వడం వంటి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
వామకుక్షి అంటే భోజనం చేసిన తర్వాత ఎడమ వైపునకు తిరిగి పడుకోవడం. ముందుగా వెల్లకిలా పడుకుని, ఆపై నెమ్మదిగా ఎడమవైపునకు ఒరగాలి. కుడి కాలును ఎడమ కాలుపై ఉంచాలి. మీ ఎడమ చేతిని తల కింద దిండులా అమర్చుకోవాలి. మరీ గాఢ నిద్రలోకి వెళ్లకుండా 15 నుంచి 20 నిమిషాల పాటు విశ్రాంతి తీసుకోవడమే వామకుక్షి. ఇది ప్రాచీన ఆయుర్వేదం సూచించిన అత్యుత్తమ జీవనశైలి పద్ధతి.
ఎడమ వైపు పడుకుంటే జీర్ణాశం ఆకృతి కారణంగా ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది. గుండెపై ఒత్తిడిని తగ్గించి, రక్తప్రసరణను సాఫీగా మారుస్తుంది. కాలేయం, కిడ్నీలు బాగా పని చేసి వ్యర్థాలను బయటకు పంపుతాయి. ఈ భంగిమ మెదడును చురుగ్గా ఉంచి, మధ్యాహ్నం వచ్చే అలసటను తగ్గిస్తుంది. ప్రతి రోజూ ఇలా చేయడం వల్ల గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు దూరమై సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంది.