రథ సప్తమి -2026: నేడు సూర్య భగవానుడికి పూజ ఎందుకు చేయాలి? ఎలా చేయాలి?.. '7' అంకె ప్రాముఖ్యత ఇదే
సూర్యుడి గమనం దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి మారే క్రమంలో మాఘ శుద్ధ సప్తమి నాడు ఆయన రథం ఉత్తర దిశగా ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది.
By - అంజి |
రథ సప్తమి -2026: నేడు సూర్య భగవానుడికి పూజ ఎందుకు చేయాలి? ఎలా చేయాలి?
సూర్యుడి గమనం దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి మారే క్రమంలో మాఘ శుద్ధ సప్తమి నాడు ఆయన రథం ఉత్తర దిశగా ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. అందుకే ఈ రోజును రథసప్తమి అంటారు. అలాగే సూర్యుడు 7 గుర్రాల రథంపై జగత్తుకు దర్శనమిచ్చింది కూడా ఈ రోజే. నేటి నుంచి సూర్య కిరణాలు భూమికి దగ్గరగా వచ్చి ప్రాణికోటికి చైతన్యం, జఠరాగ్ని పెరుగుతాయని నమ్ముతారు. పాపాలను హరింపజేసే తిథి సూర్యారాధనకు అతి ముఖ్యమైనదిగా పరిగణిస్తారు.
ఈ రోజు సూర్యుడికి పూజ ఎందుకు చేయాలి?
సూర్యుడు జన్మించిన రోజు కాబట్టి దీన్ని సూర్య జయంతిగా జరుపుకుంటారు. సూర్యరశ్మి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను పొందడానికి, చర్మ వ్యాధులు, కంటి సమస్యల నుంచి విముక్తి కోసం ఈ పూజ చేస్తారు. రథసప్తమి రోజున ఆచరించే అరుణోదయ స్నానం, సూర్యారాధన వల్ల 7 జన్మల పాపాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి. ఆయురారోగ్యాలు, సంతానప్రాప్తి కోసం నిష్టతో ఈ పూజ చేస్తారు.
పూజ ఎలా చేయాలంటే?
రథసప్తమి నాడు సూర్యరశ్మి పడే చోట ఆవు పేడతో శుద్ధి చేయాలి. పిడకల పొయ్యి పెట్టాలి. ఇత్తడి పాత్రలో ఆవు పాలను పొంగించాలి. పాలు పొంగే సమయంలో కొత్త బియ్యం, బెల్లంతో పరమాన్నం చేయాలి. దాన్ని చిక్కుడాకుల్లో సూర్యుడికి నివేదించాలి. అనంతరం అందరికీ వితరణ చేస్తే మంచి జరుగుతుందని నమ్మకం. అలాగే చిక్కుడు కాయలు, కొబ్బరి పుల్లలతో చిన్న రథాన్ని తయారు చేసి పూజించాలి. పాలు పొంగడం ఇంటి అభివృద్ధికి సంకేతంగా భావిస్తారు.
రథ సప్తమి రోజున '7' అంకె ప్రాముఖ్యత
ప్రకృతిలో 7 అంకెకు ఎంతో ప్రాధాన్యముంది. సప్త స్వరాలు, వారాలు, రుషులు, 7 కొండలే కాకుండా సూర్యుడి తొలి 7 కిరణాలు కూడా అంతే ముఖ్యమైనవి. అవి: సుషుమ్న, హరికేశ, విశ్వకర్మ, విశ్వశ్రవ, సంపద్వసు, అర్వాగ్వసు, స్వరాణ్. ఈ ఏడు కిరణాలు ఏడు రంగులకు మూలమని చెబుతారు. ఇవి విశ్వమంతా శక్తిని, ఆరోగ్యాన్ని నింపుతాయని శాస్త్ర వచనం. సూర్యుని రథనాకి ఉండే ఏడు గుర్రాలు కూడా ఈ కిరణాలలోని అద్భుత శక్తికి సంకేతాలే.